New trend in tollywood: మొన్న మహేశ్ బాబు ‘పోకిరి’… నిన్న పవన్ ‘జల్సా’… ఇప్పుడు బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’. టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. దానికి తగ్గట్లే ఆయా సినిమాలకు అపూర్వమైన ఆదరణ లభించింది. లభిస్తోంది. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ‘పోకిరి’ స్పెషల్ షోలు ప్రదర్శించగా మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని ‘జల్సా’ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఆటలను ప్రదర్శించగా అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ నెల 25న బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు బెల్లంకొండ సురేశ్. ఇప్పటికే ఫ్యాన్స్ విదేశాల్లో భారీ ఎత్తున రిలీజ్‌కి సన్నాహాలు చేశారు.
NTR: జూనియర్ యన్టీఆర్ ట్వీట్ పై విమర్శలు!
తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాత బెల్లంకొండతో పాటు దర్శకుడు వినాయక్ విలేకరుల సమావేశంలో తెలియచేశారు. గత వారం ధనుష్ నటించిన ‘త్రీ’ సినిమాను నట్టికుమార్ రీ-రిలీజ్ చేయగా బ్రహ్మాండమైన లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇక ఇదే ఊపులో ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఆది’, వెంకటేశ్ క్లాసికల్ మూవీ ‘క్షణం క్షణం’ సినిమాలను కూడా రీ-రిలీజ్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలై ఢాం మని పేలిపోతుండటంతో పాతవే బెటర్ అనే అవగాహనకు పంపిణీదారులు, ప్రదర్శనదారులు వచ్చినట్లు తెలియవస్తోంది. కొత్త సినిమాలను విడుదల చేసి చేతులు కాల్చుకునే కంటే పాత సినిమాలతో ఓ రూపాయి సంపాదించుకోవచ్చన్న ఆలోచనతో అటువైపు మొగ్గు చూపుతున్నారట. మరి ఈ ట్రెండ్ ఉధృతం అవుతుందా? లేక పాలపొంగులా చల్లారి పోతుందా? అన్నది చూడాలి.
