NTR:’డాక్టర్ యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ పేరును ‘డాక్టర్ వై.యస్.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా మార్చడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నందమూరి అభిమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో యన్టీఆర్ కుటుంబ సభ్యులే కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సోదరి వై.యస్.షర్మిల సైతం ఈ పేరు మార్పును తప్పు పట్టారు. దాంతో మరింత వేడి రగిలింది. తాత పేరు పెట్టుకొని తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకునిగా సాగుతున్న జూనియర్ యన్టీఆర్ ఈ విషయంపై పెదవి విప్పలేదే అంటూ నిన్నటి నుంచీ అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ రోజు (గురువారం) జూనియర్ యన్టీఆర్ ఈ విషయంపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కారణంగా అతను మరింత చిక్కుల్లో ఇరుక్కున్నాడనీ జనం అంటున్నారు. ఎందుకంటే తారక్ చేసిన ట్వీట్ లో ‘కర్ర ఇరగకుండా, పాము చావకుండా’ అన్న చందం కనిపించిందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
ఇంతకూ జూనియర్ చేసిన ట్వీట్ ఏమిటంటే – “యన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్పనాయకులు. ఈ రకంగా ఒకరిపేరు తీసి మరొకరి పేరు పెట్టడం వైయస్సార్ స్థాయిని పెంచదు. యన్టీఆర్ స్థాయిని తగ్గించదు” అని అన్నారు. దాంతో పాటు ‘విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా యన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరనీ’ జూనియర్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన జనం విస్తూ పోయారు. ఇంతకూ ఈయన వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యను ఖండించాడా లేదా? ఎందుకీ డొంగతిరుగుడు, మెతకవైఖరి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లో తగిన నాయకుడు తమ హీరోనే అని జూనియర్ ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు. ఒకవేళ భవిష్యత్ లో రాజకీయ రంగంలోకి రావాలనుకుంటే, తారక్ ఇలాంటి వైఖరి ప్రదర్శించకూడదనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందూ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, తారక్ కు మేనమామ అయిన చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని (స్వయానా జూ.యన్టీఆర్ తండ్రి హరికృష్ణ చెల్లెలు)ను ఓ ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడడం పట్ల కూడా అప్పట్లో జూనియర్ చాలా ఆలస్యంగా స్పందించారు. ఆ స్పందనలోనూ ఇలాగే ‘కర్ర విరగక, పాము చావక’ అన్న పరిస్థితే కనిపించింది. ఇలాంటి ట్వీట్స్ ద్వారా తారక్ ఒరిగేదానికన్నా అతని ఇమేజ్ తరిగే ప్రమాదం ఉందనీ కొందరు హెచ్చరిస్తున్నారు.
అసలు ‘డా.యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ చరిత్ర అయినా జూనియర్ కు తెలుసా అని కొందరి అనుమానం! హెల్త్ కు సంబంధించిన అన్ని విద్యలను ఒక గూటి కిందకు తెస్తూ యన్టీఆర్ 1986లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో యూనివర్సిటీని నెలకొల్పారు. ఇది అక్షరాలా యన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్! ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ 1989, 2004, 2009లో అధికారంలోకి వచ్చినా, కూడా ఎవరూ ఆ యూనివర్సిటీ పేరును మార్చలేదు. దాదాపు 36 సంవత్సరాలుగా కొనసాగుతున్న యన్టీఆర్ పేరును తీసేసి వైయస్సార్ పేరును జగన్మోహన్ రెడ్డి పెట్టడం నిజంగా విడ్డూరమే! ముంబైలోని విక్టోరియా టెర్మినల్ కు కొన్నేళ్ళ క్రితం ‘ఛత్రపతి శివాజీ’ పేరు పెట్టారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మనలను బానిసలుగా చూసిన బ్రిటీష్ వారి పేరుకన్నా మన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహాయోధుని పేరు పెట్టడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం విడిపోగానే ‘ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి’ పేరు మార్చారు. అదేమంటే, రంగా ఆంధ్రుడు అన్నారు. కానీ, యన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు. ఆయన పేరును ఆ తరువాత పాలకులు సైతం గౌరవించారు. జగన్ చేసిన ఈ చర్యను జూనియర్ ఏ కోణంలోనూ విమర్శించక పోవడం విమర్శలకు దారితీస్తోంది.