మూడు దశాబ్దాల క్రితం రాయలసీమలోని తాడిపత్రిలో జరిగిన ఓ హత్యను ఆధారంగా చేసుకుని ‘రెక్కీ’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య, తదనంతర పరిణామాలతో ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ను పోలూరి కృష్ణ తీశారు. ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఏడు ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ‘రెక్కీ’ని జూన్ 17న జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పోలీస్ ఇన్ స్పెక్టర్ లెనిన్ గా శ్రీరామ్ నటించగా, శివ బాలాజీ, ధన్యా బాలకృష్ణ, ‘ఆడుకాలం’ నరేన్, ఎస్తర్ నొరోహా, జీవా, శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్, రామరాజు, సమ్మెట గాంధీ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
రోలర్ కాస్టర్ రైడ్ ను తలపించే ఈ వెబ్ సీరిస్ మోషన్ పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. 90లలో తాడిపత్రిలో జరిగిన రెండు హత్యలకు సంబంధించిన మిస్టరీని ఛేదించే పని లెనిన్ అనే పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కు ఇస్తారు. ఇవి రాజకీయ హత్యలా? ఫ్యాక్షన్ హత్యలా? లేక ఇంకేవైనా వేరే విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయా? అనేది దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడని నిర్మాత శ్రీరామ్ కొలిశెట్టి తెలిపారు. ఇందులో శివబాలాజీ గతంలో ఎప్పుడు పోషించని శ్రీరామ్ అనే పాత్రలో కనిపిస్తాడని, అత్యధిక శాతం షూటింగ్ అనంతపూర్ లో చేశామని, వాస్తవానికి దగ్గరగా ఈ వెబ్ సీరిస్ ఉండేలా దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు కృషి చేశారని నిర్మాత చెప్పారు.