ప్రతి సినిమాకి తన నటనలోని నైపుణ్యాన్ని పెంచుకుంటూ వెళుతోంది హీరోయిన్ రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఆమె ‘నేనే… నా?’ చిత్రంలో రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తోంది. నిను వీడని నీడను నేనే
వంటి హిట్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. అలానే జాంబీరెడ్డి
తో సూపర్ హిట్ ను అందుకున్న రాజశేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘నేనే…నా?’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను నిధి అగర్వాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ లింగుసామి ఆవిష్కరించారు.
ట్రైలర్ చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు పునరావృతమవుతున్నట్లు తెలుస్తోంది. రెజీనా 100 సంవత్సరాల క్రితం రాణి కాగా, ఆమె ప్రస్తుతం పురావస్తు శాస్త్రవేత్తగా, ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చినట్టు అర్థమౌతోంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కుర్తాళం దాని చుట్టుపక్కల ప్రాంతాలలో చిత్రీకరించారు. సామ్ సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా, గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాబు ఎడిటర్ కాగా సూపర్ సుబ్బరాయన్ స్టంట్ మాస్టర్ గా వ్యవహరించారు.
షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘నేనే… నా?’ చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, అక్షరగౌడ, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.