కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక ఆర్టిస్ట్ కి లేదా హీరోకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది అంటే అతను ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ కష్టాల్లో పడినట్లే. స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసారు, దీంతో దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో నెలకొంది. తమిళ స్టార్స్ సిలంబరసన్ శింబు, విశాల్, ఎస్జె సూర్య, యోగి బాబు, అధర్వలపై కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డుని ఇష్యూ చేసింది. ప్రొడక్షన్ హౌజ్ లకి సమయానికి స్పందించకపోవడం, అడ్వాన్స్ లు తీసుకోని డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం, సెట్స్ లో వివాదాల కారణంగానే ఈ రెడ్ కార్డ్ ని ఇష్యూ చేసారు.
తమిళనాడు నిర్మాతల మండలి, ఎన్ రామసామి నేతృత్వంలో, జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ శింబు, విశాల్, SJ సూర్య, యోగి బాబు, అథర్వపై యాక్షన్ తీసుకున్నారు. దర్శకుడు గోకుల్ చిత్రం కరోనా కుమార్ నుండి వాకౌట్ చేసినందుకు శింబు, లైకా ప్రొడక్షన్స్‌కు డబ్బులు తిరిగి చెల్లించనందుకు విశాల్, అడ్వాన్స్ తీసుకొని కూడా నిర్మాతలకు డేట్లు ఇవ్వనందుకు ఎస్‌జె సూర్య, యోగి బాబు, అధర్వలపై యాక్షన్ తీసుకున్నారు. ఇకపై ఇతర నిర్మాతలు ఈ నటులతో సినిమాలు చేసే ముందు కౌన్సిల్ ని తెలియజేయాల్సి ఉంటుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుంది? దీన్ని సాల్వ్ చెయ్యడానికి ఎవరు ముందుకి వస్తారు అనేది చూడాలి. ఒకవేళ ఈ రెడ్ కార్డు అలానే ఉంటే విశాల్, శింబు లాంటి స్టార్స్ నటిస్తున్న సినిమాలకి కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.