కథలు కొత్తగా పుట్టుకురావనీ, మన చుట్టూ జరిగే అంశాలను పరిశీలిస్తూ ఉంటే ఏదో ఒకటి తడుతుందని అంటారు సినీజనం. అందులోనూ పాతదనం ఉండకపోదనీ చెబుతారు. అప్పుడూ వీలు కాని పక్షంలో మన కథలనే మనం తెరకెక్కించుకోవలసి ఉంటుందనీ అంటారు. విఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ సైతం అదే పంథాలో పయనించారు. ఒకప్పుడు తన చిత్రాలతో యావత్ ప్రపంచాన్నీ ఆకట్టుకున్న స్టీవెన్ గత కొంతకాలం నుంచీ మునుపటి స్థాయి విజయాలను చవిచూడడం లేదు. అయితేనేమి, పట్టువదలని విక్రమార్కునిలా స్పీల్ బెర్గ్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘ద ఫ్యాబెల్ మ్యాన్స్’ ఆయన కథనే అట! చెప్పాలంటే స్టీవెన్ స్పీల్ బెర్గ్ బయోపిక్ గా దీనిని భావించవచ్చు. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అమెరికాలో ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 23న రిలీజ్ చేయబోతున్నారు.
‘ద ఫ్యాబెట్ మ్యాన్స్’ కథ రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాలోని ఆరిజోనాలో ఓ యువకుడు తన ఏడో సంవత్సరం నుండి పద్దెనిమదో సంవత్సరం దాకా జీవనం సాగిస్తాడు. అతను తన వంశం గురించిన ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొంటాడు. దానిని సినిమా పవర్ తో ఎలా లోకానికి చాటాడు అన్నదే ఇందులోని కథ. ఇందులో కథానాయకుని పేరు శామీ ఫ్యాబెల్ మ్యాన్. ఈ పాత్రను గాబ్రియెల్ లాబెల్లే పోషించారు. ఈ లైన్ చూస్తోంటేనే ఇది స్పీల్ బెర్గ్ కథ అని తెలిసిపోతోంది. టోరంటోలో ఈ సినిమా ప్రదర్శన చూసిన వారందరూ లేచి నిలబడి స్పీల్ బెర్గ్ ను ఎంతగానో అభినందించారు. ఇతరుల కథను తొంగి చూసి తెలుసుకోవడం సులభమైనదని, మన కథలోనే మనం తొంగి చూసుకుంటూ పోతే లోతు ఎంతో ఉంటుందని స్పీల్ బెర్గ్ ఈ సందర్భంగా అన్నారు. ‘ద ఫ్యాబెల్ మ్యాన్స్’ రూపొందించడానికి తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. తన జీవితంలో ఇంతగా కష్టపడ్డ సినిమా లేదనీ తెలిపారు. గ్రాఫిక్స్ తో యావత్ ప్రపంచాన్నీ మాయ చేసిన స్పీల్ బెర్గ్ అంతటివాడు ఎంతో కష్టపడ్డానని చెబుతున్న ‘ద ఫ్యాబెల్ మ్యాన్స్’ మరి ఏ తీరున జనాన్ని అలరిస్తుందో చూడాలి.