‘Real Hero’… Sonu Sood! Birthday Special
సోనూ సూద్ – ఈ పేరుకు నేడు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. పరిచయం అక్కరలేదు. అనేక చిత్రాలలో ప్రతినాయకునిగా పలకరించి, భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరు చూసి, తెరపై ఆయనను చూసి జడుసుకున్నవారే పులకించి పోతూ అభినందనలు తెలిపారు. తనకున్న పరిధిలో సోనూ సూద్ అనితరసాధ్యంగా సాయం అందించడంపై అందరూ ఆయన కరుణరస హృదయానికి జేజేలు పలుకుతున్నారు. ‘తెరపై విలన్… రియల్ లైఫ్ హీరో…’ అంటూ కితాబునిస్తున్నారు.
పంజాబ్ లోని మోగాలో 1973 జూలై 30న జన్మించిన సోనూ సూద్ ‘శాక్రిడ్ హార్ట్ స్కూల్’లో చదివి, తరువాత నాగపూర్ లో ఇంజనీరింగ్ చేశారు. చదువు పూర్తయిన దగ్గర నుంచీ సోనూ సూద్ కు సినిమాలపైనే మనసు మళ్ళింది. ఆ క్రమంలో మోడల్ గా నటించారు. అందివచ్చిన పాత్రనల్లా అంగీకరించారు. ఆరంభంలో తమిళ చిత్రాలలో నటించారు. నాగార్జున నిర్మించి, నటించిన ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అంతకు ముందే కొన్ని అనువాద చిత్రాల ద్వారా సోనూ తెలుగుజనానికి పరిచయమే. అంతేకాదు, ఆయనకు తెలుగువారితో ముందు నుంచీ బంధం ఉంది. 1996లోనే తెలుగమ్మాయి సోనాలీని పెళ్ళాడారు. వారికి అయాన్, ఇషాంత్ అనే ఇద్దరు అబ్బాయిలు.
దేశవ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన కష్టజీవులకు కరుణతో సహాయం అందించారు. అందుకోసం ‘సూద్ ఛారిటీ’ నెలకొల్పారు. సోనూ మంచి మనసు చూసి, ఆయన ఛారిటీకి కొందరు దాతలు విరాళాలు ఇచ్చారు.
యుపిఎస్సీ పరీక్షలకు వెళ్లాలనుకొనే ఆర్థిక స్తోమత లేనివారికి సరైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా పలు సేవాకార్యక్రమాలు చేస్తూ సాగిపోతున్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అగణిత అభిమానగణాలు వెలిశాయి. సోనూ సూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంగీకరించిన చిత్రాలు పూర్తయిన తరువాత సోనూ సూద్ హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తారేమో చూడాలి.