Raviteja: మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’ సాధారణ ప్రేక్షకులనే కాదు అతని అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. ‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత ‘రావణాసుర’తో రవితేజ హ్యాట్రిక్ ఖాయంగా కొడతాడని నమ్మిన ఫ్యాన్స్ కోరిక తీరలేదు. అభిషేక్ నామాతో కలిసి ఈ సినిమాను తీసిన రవితేజ భారీగా నష్టపోయాడనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకంటే ముందు రవితేజ టీమ్ వర్క్స్’ నుండి వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’కి, తమిళ హీరో విష్ణు విశాల్ సినిమాలకూ రవితేజ సమర్పకుడిగా వ్యహరిస్తున్నాడు. అలా వచ్చిన ‘మట్టి కుస్తీ’ మూవీ సైతం పరాజయం పాలైంది. దాంతో చిత్ర నిర్మాణం రవితేజకు అచ్చిరావడం లేదనే సెంటిమెంట్ ఒకటి మొదలైపోయింది.
ఈ సంగతి పక్కన పెడితే ‘రావణాసుర’ విజయంపై ఉన్న నమ్మకంతో ఓన్ రిలీజ్ కు రవితేజ, అభిషేక్ నామా సిద్ధపడ్డారు. కానీ రవితేజ గత చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా ‘రావణాసుర’కు రాలేదు. రవితేజ ఫ్లాప్ మూవీ ‘ఖిలాడి’కి వరల్డ్ వైడ్ మొదటి రోజు రూ. 6.75 కోట్ల నెట్ వసూలు కాగా…. భారీ అంచనాలతో వచ్చిన ‘రావణాసుర’ కేవలం రూ. 6 కోట్ల నెట్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూవీపై నెగెటివ్ టాక్ భారీగా స్ప్రెడ్ కావడంతో వీకెండ్ లోనూ పెద్దంత ఆశాజనకంగా కలెక్షన్లు ఉండవనిపిస్తోంది. సహజంగా రవితేజ మూవీ అంటే యూత్ తో పిల్లలూ చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ రొటీన్ కు భిన్నంగా వెళ్ళాలనే తలంపుతో రవితేజ తన ఇమేజ్ ను భిన్నంగా ‘రావణాసుర’ చేశారు. దాంతో అన్నిరకాలుగా ఈ కంటెంట్ మోతాదుకు మించిపోయి ‘ఎ’ సర్టిఫికెట్ అందుకుంది. ఈ కథ మీద రవితేజ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది.
మరో వెర్షన్ ఏమంటే… ‘రావణాసుర’ చిత్రాన్ని పరభాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన నిర్మాణ సమయంలో నిర్మాతలకు కలిగిందట. అయితే ఈ పాయింట్ కు జనం ఎంతవరకూ కనెక్ట్ అవుతారో అనే సందేహంతో తెలుగుతో పాటు కేవలం హిందీ, తమిళంలో మాత్రమే డబ్ చేయాలని అనుకున్నారట. అయితే చివరి క్షణంలో ఆ రెండు వర్షన్స్ డబ్బింగ్ కూడా చేయలేదని తెలుస్తోంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… హుటాహుటిన డబ్ చేసి, రెండు వారాల తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే ఇప్పుడు ఆ ఆలోచనకూ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనని ఇన్ సైడ్ టాక్. ఇంతే కాకుండా ‘రావణాసుర’కు వచ్చిన ప్రతికూల ఫలితం… రవితేజ తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర నాగేశ్వరరావు’ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. సో… ‘రావణాసుర’ నిర్మాత అభిషేక్ నామా దెబ్బ నుండి ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఎలా తప్పించుకుంటారో చూడాలి!