రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన నాల్గవ చిత్రం ‘రాత్రి’. తొలీ సినిమా ‘శివ’తోనే తనదైన బాణీ పలికించిన రామ్, తరువాత అదే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి అలరించారు. ఆ పై మూడో సినిమాగా ‘క్షణ క్షణం’ రూపొందించారు. నాల్గవ చిత్రం ‘రాత్రి’ని మాత్రం ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. ఈ హారర్ ఫిలిమ్ ద్వారానే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పరిచయం కావడం విశేషం. తొలి నుంచీ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తన పనితనానికి వన్నెలు అద్దుకున్న రామ్ గోపాల్ వర్మ, అదే తీరున ‘రాత్రి’ చిత్రంతో హారర్ జానర్ కు ఓ కొత్త రూపు కల్పించాలని తపించారు. ఆ తపన ఈ సినిమా అణువణువునా కనిపిస్తుంది. 1992 ఫిబ్రవరి 7న ‘రాత్రి’ విడుదలై హారర్ మూవీస్ అభిమానులను ఆకట్టుకుంది.
కథ విషయానికి వస్తే.. విన్నీ అనే అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటుంది. తల్లి, తండ్రి, తమ్ముడుతో కలసి ఓ కొత్త ఇంటికి మారుతారు. విన్నికి దీపక్ అనే ఫ్రెండ్ ఉంటాడు. ఎంతో సరదాగా ఉంటారు. ఓ సారి పిక్నిక్ వెళ్లొస్తారు. అప్పటి నుంచీ విన్నీలో ఓ మార్పు కనిపిస్తుంది. ఆమె వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చివరకు కన్న తండ్రినే గొంతు పట్టుకొని గాల్లోకి ఎత్తేస్తుంది. తండ్రి ఓ సైకియాట్రిస్ట్ ను తీసుకు వస్తాడు. ఆయన ఆమె ప్రవర్తనకు ఏదో సైంటిఫిక్ నేమ్ చెబుతాడు. కానీ, భయాందోళనలకు గురైన విన్నీ తల్లి ఓ మాంత్రికుని సంప్రదిస్తుంది. అతను వచ్చి, ఆ ఇంటిని పరీక్షించి, ఓ చోట తవ్వమంటాడు. అతనికి దీపక్ సహకరిస్తాడు. ఇంటి కింది భాగంలో వారికి ఎర్ర చీర కట్టుకున్న ఓ దెయ్యం కనిపిస్తుంది. మంత్రగాడు తన మంత్రశక్తితో దానిని పారదోలతాడు. అది విన్నీని, ఆ ఇంటిని వీడిపోతుంది. కథ ఆరంభంలోనే విన్నీ చిన్నారి తమ్ముడు తన పిల్లిని చచ్చిపోయిన దానిని చూస్తాడు. తరువాత సినిమా ముగింపులో అతని చేతిలో అచ్చు అలాంటి పిల్లి బతికి కనిపిస్తుంది. దాంతో కథ ముగుస్తుంది.
బోనీ కపూర్ సమర్పణలో వర్మ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రేవతి, చిన్నా, రోహిణీ హట్టంగడి, ఆకాశ్ ఖురానా, ఓంపురి, అనంత్ నాంగ్, నిర్మలమ్మ, తేజ్ సప్రూ, సునంద, నరసింహరావు నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. అనుక్షణం ప్రేక్షకులను భయపెట్టేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మణిశర్మ ఆకట్టుకున్నారు. ఇక కెమెరా పనితనాన్ని కూడా అభినందించి తీరాల్సిందే. స్టడీకామ్ తోనే అదరగొట్టిన ఈ సినిమాకు రసూల్, ప్రసాద్ స్టడీ కామ్ ను ఆపరేట్ చేశారు. తరువాతి కాలంలో దర్శకునిగా పేరు సంపాదించిన తేజ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
మణిశర్మ సంగీతంపై భరోసా కుదరడంతో తరువాత నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అంతం’ చిత్రంలో “చలెక్కి ఉందనుకో…” పాటకు స్వరకల్పన చేయించారు. తరువాత ‘సూపర్ హీరోస్’తో మణిశర్మ సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన సంగతి తెలిసిందే!