Rangamarthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’ విడుదల తేదీ ఖరారైంది. షడ్రుచుల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఉగాది కానుకగా ఈ నెల 22న జనం ముందుకు తీసుకు రాబోతున్నారు. బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘రంగమార్తాండ’కు క్లీన్ యు సర్టిఫికెట్ లభించిందని చిత్ర బృందం తెలిపింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మూలం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’. నానాపటేకర్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఆ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించాడు. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో దీన్ని కాలెపు మధు, వెంకటరెడ్డి నిర్మించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చడంతో పాటు ఇందులోని కొన్ని గీతాలను ఆలపించారు. ఆకెళ్ళ శివప్రసాద్ సంభాషణలు సమకూర్చగా, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, లక్ష్మీ భూపాల, కాసర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ పాటలు రాశారు.
స్పెషల్ షోస్ కు సూపర్ రెస్పాన్స్!
ఇదిలా ఉంటే… ‘రంగమార్తాండ’ సినిమా తొలి కాపీ సిద్ధమైన తర్వాత దర్శక, నిర్మాతలు సినిమా రంగానికి చెందిన వారితో పాటు కొందరు సన్నిహిత మిత్రులకు స్పెషల్ షోస్ ను వేశారు. ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ ‘కృష్ణవంశీ ఈజ్ బ్యాక్’ అంటూ ఆయనపై అభినందన జల్లలు కురిపిస్తున్నారు. అలానే మరికొందరు తమ భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దాంతో విడుదలకు ముందే ‘రంగమార్తాండ’కు ఊహంచని రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. మానవీయ విలువల గురించి కృష్ణవంశీ తనదైన శైలిలో చాలా బలంగా చక్కని సందేశాన్ని అందించారని అభినందిస్తున్నారు. మరో విశేషం ఏమంటే… ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ, ఇటీవలే చిత్ర పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ దీని థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఉగాది కానుకగా ఈ సినిమాను ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం పోటీ పడి నటించిన ‘రంగమార్తాండ’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.