‘పెళ్ళయింది… ప్రేమవిందుకు వేళయింది…’అంటూ కొత్త జంట రణబీర్ కపూర్- అలియా భట్ పాడుకుంటున్నారు. వారి ప్రేమవిందుకోసం రణబీర్ తండ్రి రిషికపూర్ గతంలో నిర్మించిన బంగ్లాను ముస్తాబు చేస్తున్నారు. ఈ బంగ్లాను రిషికపూర్ తన తండ్రి రాజ్ కపూర్, తల్లి కృష్ణ కపూర్ పేర్ల మీద ‘కృష్ణ-రాజ్’పేరుతో నిర్మించారు. రణబీర్, అలియా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సమయం నుంచీ ‘కృష్ణ-రాజ్’ బంగళాను అధునాతనంగా మార్చడానికి రణబీర్ తల్లి నీతూ కపూర్ ఆదేశించారు. దాదాపు సంవత్సరం నుంచీ ఆ బంగ్లాను కోరిన విధంగా మారుస్తున్నారు. నిజానికి రణబీర్, అలియా పెళ్ళి నాటికి ‘కృష్ణ-రాజ్’ నూతన శోభతో పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ, ఇంకా చాలా పని పూర్తి కాలేదని, మరో ఆరు నెలల సమయం పట్టేట్టు ఉందని తెలుస్తోంది. అందువల్ల ‘కృష్ణ-రాజ్’కు ఓ అరకిలోమీటర్ దూరంలో ‘వాస్తు’ అనే భవంతిని కొత్త జంట కోసం తీసుకున్నారట!
పాలీ హిల్స్ లోని ‘కృష్ణ-రాజ్’ బంగళాలోకి ఎప్పుడు వెళ్దామా అని కొత్త జంట తహతహలాడుతోంది. ఎందుకంటే తమ అభిరుచికి అనువుగా ఆ భవంతికి మరమ్మత్తులు చేయించారు. ఆ లోగా ‘వాస్తు’లో ఉండాల్సి వచ్చింది. ఇందులో ఏమీ వింతలేదు. అయితే ఇదే ‘వాస్తు’లో మూడేళ్ళ క్రితం కత్రినా కైఫ్ తో కలసి ఉన్నాడట రణబీర్ కపూర్. ప్రస్తుతానికి రణబీర్-అలియాకు ‘వాస్తు’నే తాత్కాలిక గృహం. అలియాకు కొత్తకానీ, ఆ ఇల్లు రణబీర్ కు పాతదే! మరి ఈ జంట ‘కృష్ణ-రాజ్’ బంగాళాలోకి మారేదెప్పుడు? డిసెంబర్ లో తన తల్లి నీతూ కపూర్, భార్య అలియాతో కలసి ‘కృష్ణ-రాజ్’లో అడుగు పెట్టనున్నాడు రణబీర్. బహుశా, తన తాత రాజ్ కపూర్ జయంతి అయిన డిసెంబర్ 14న ఆ గృహప్రవేశం ఉండవచ్చునని వినికిడి!