పొద్దున్నే ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ దృష్టి, స్టార్ కపుల్ ధనుష్, ఐశర్వ విడాకుల మీద పడినట్టుగా ఉంది. సహజంగా పెళ్ళంటే పడని వర్మ ఎప్పటిలానే పెళ్ళి – దాని పర్యవసానాలపై నాలుగైదు ట్వీట్స్ పెట్టేశాడు. బట్ ఆ పోస్టులు, దానికి వచ్చిన స్పందన వర్మకు పెద్దంత కిక్ ఇచ్చినట్టు లేవు. ఇక మెగా ఫ్యామిలీ మీద పడ్డాడు. ‘అంగీకరించడానికి కష్టంగా ఉన్నా ఇక ‘అల్లు’ అనేది కొత్త ‘మెగా’! అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో దీనిపై ఇటు మెగాభిమానులు, అటు అల్లు అర్జున్ అభిమానులు కిందా మీదా పడుతున్నారు. ‘ఈ రెండు కుటుంబాలను ఎవరూ వేరు చేయలేరు, వారి మధ్య చిచ్చుపెట్టలేరు’ అని కొందరు చెబుతుంటే, ‘అవును మీరు చెప్పింది నిజమే… అల్లు అర్జున్ నెక్ట్స్ మెగాస్టార్’ అని మరికొందరు అంటున్నారు. దాంతో ఈ వివాదాల కుంపట ముందు వర్మ ఎంచక్కా చలి కాచుకుంటున్నాడు.
నిజానికి వర్మ పెట్టిన ట్వీట్ లోని అంశం ఇవాళ కొత్తగా చర్చకొచ్చిందేమీ కాదు. రెండు మూడేళ్ళుగా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నీడ తనపై పడకూడదని గట్టిగానే అనుకుంటున్నాడు. తనకంటూ ‘ఎఎ’ అనే బ్రాండ్ ను సెపరేట్ గా క్రియేట్ చేసుకున్నాడు. అదే సమయంలో ఓ భారీ స్టూడియోనూ నెలకొల్పుతున్నాడు. బంధాలను, అనుబంధాలను మెగా ఫ్యామిలీతో కొనసాగించినా, తనకంటూ ఓ గుర్తింపును బన్నీ ఖచ్చితంగా కోరుకుంటున్నాడని అందరికీ అర్థమౌతోంది. కానీ ఎవరికి వారు దాని గురించి బయట ముచ్చటించడానికి ఇష్టపడటం లేదు. ఆ రకంగా మెగాభిమానుల్లో, అల్లు ఫ్యాన్స్ లో ఉన్న సందేహాలకు, సంశయాలకు వర్మ ట్వీట్ ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇదే ఛాన్స్ అని ఎవరికి వారు తమ వెర్షెన్స్ తెలిపే ప్రయత్నంలో పడ్డారు.
సినిమా టిక్కెట్ల వ్యవహారం నుండి వర్మ తన దృష్టిని మెగా – అల్లు ఫ్యామిలీ మీదకు మరల్చడంలోనూ ఏదో హిడ్డెన్ ఎజెండా ఉండే ఉంటుంది. పైగా తాను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నానిని కలిసి కొద్ది రోజులకే చిరంజీవి… ముఖ్యమంత్రి జగన్ ను కలవడాన్ని వర్మ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో!
The hard but indisputable fact is ALLU is the new MEGA
— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022