‘మా ఇష్టం’ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. నిన్నటిదాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, కేసులు పెట్టుకున్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదిరింది. తమ మధ్య ఏర్పడ్డ అపార్ధాలు పూర్తిగా తొలగిపోయాయని తెలిపిన ఆ ఇద్దరు.. పరస్పరం నమోదు చేసుకున్న కేసుల్ని సైతం వెనక్కు తీసుకున్నట్టు సంయుక్తంగా ప్రకటించారు. అసలేం జరిగిందంటే..
‘మా ఇష్టం’ సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సరిగ్గా వర్మ ‘డేంజరస్’ సినిమా విడుదల సమయంలో.. నట్టి ఎంటర్టైన్‌మెంట్స్‌కు చెందిన నట్టి క్రాంతి కుమార్, నట్టి కరుణ్ కోర్టుని ఆశ్రయించారు. తమకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, వర్మ వేరే సినిమాలు తీసుకుంటున్నాడని.. ‘డేంజరస్’ సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని కోరారు. ఈ కేసుని విచారించిన కోర్టు.. ‘డేంజరస్’పై స్టే విధించింది. దీంతో వర్మ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ గత నెలలో నట్టి క్రాంతి, కరుణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్ కాపీ చేసి, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పుడు నట్టికుమార్ వర్మకి వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన చాలామందికి అప్పులు ఇవ్వాలని, తామంతా ఇప్పుడు కలిశామని, వర్మ సినిమాలు రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. అయితే.. తాజాగా వర్మ, నట్టి కుమార్ మధ్య జరిగిన చర్చలతో ఆ విభేదాలు తొలగిపోయాయి. ఇరువురు రాజీకి వచ్చారు. కొన్ని పరిస్థితుల వల్లే నట్టి కుటుంబంపై కేసు పెట్టాల్సి వచ్చిందని, తనకు వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదని వర్మ స్పష్టం చేశారు. నట్టి కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. కొందరు వ్యక్తుల కారణంగా తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, ఇప్పుడవన్నీ సమసిపోయాయని వివరించారు.