పదేళ్ల క్రితం హిట్ పడింది, అయిదేళ్ల క్రితం యావరేజ్ సినిమా పడింది… నాలుగేళ్లుగా హిట్ అనే మాటనే తెలియదు… ఇలాంటి సమయంలో యంగ్ హీరోస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుంటే ప్రతి ఇండస్ట్రీ మేధావీ రజినీ టైమ్ అయిపొయింది అని నోరు జారాడు. రజినీకాంత్ సినిమాలు మానేయడం బెటర్, ఇక ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు అంటూ తోచిన విమర్శలు చేసారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఒక్క సరైన సినిమా పడితే రజినీ రేంజ్ ఏంటో చూపిస్తాం అని ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తూ వచ్చిన సూపర్ స్టార్ ఫాన్స్ కి ‘జైలర్’ సినిమా దొరికింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి రిపీట్ మోడ్ లో వెళ్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ బుకింగ్స్ రాబడుతున్న సినిమా మరొకటి లేదు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ లో కూడా జైలర్ సినిమా కలెక్షన్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో రజినీ సినిమాని డబ్బింగ్ మూవీగా చూడరు, ఇక్కడి స్టార్ హీరోలానే రజినీకాంత్ ని చూడడం మన ప్రేక్షకులకి అలవాటు అయిపొయింది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమా కలెక్షన్స్ అనే చెప్పాలి. మొదటి రోజే పది కోట్లు రాబట్టిన జైలర్ సినిమా, సెకండ్ డే కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అయినా కూడా జైలర్ కలెక్షన్స్ లో పెద్దగా డిప్ కనిపించలేదు. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి జైలర్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ పెంచడానికి రెడీ అయ్యారు ఏషియన్ సినిమాస్ అండ్ దిల్ రాజు. ఇప్పటికే 70% రికవర్ చేసిన జైలర్ మూవీ ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వనుంది. థియేటర్లు పెరిగితే జైలర్ ఊహించని లాభాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ.