Rajeev Sen Claps back At Charu Asopa Allegations: భర్త రాజీవ్ సేన్ తనకు నరకం చూపించాడని, తన కెరీర్‌ని నాశనం చేశాడని బుల్లితెర నటి చారు అసోప ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! పెళ్లి అయినప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడని, గొడవ జరిగిన ప్రతీసారి తనను ఒంటరిగా వదిలి వెళ్లిపోయేవాడని ఆమె వాపోయింది. ఈ విభేదాల కారణంగా ఒకసారి తాము విడిపోయామని, ఆ తర్వాత బాగా చూసుకుంటానని మాటివ్వడంతో మళ్లీ కలుసుకున్నామని, అయినా అతనిలో మార్పు రాలేదంటూ ఆ అమ్మడు రోదించింది. అతడు పెట్టిన టార్చర్ వల్ల కొన్ని ఆఫర్లు కోల్పోయానని, ఇప్పుడు అతనితో విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. రాజీవ్ సేన్ పెట్టిన టార్చర్ గురించి, అతని సోదరి సుశ్మితాకి కూడా తెలుసని ఆమె బాంబ్ పేల్చింది.
ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన రాజీవ్ సేన్.. చారు అసోప చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని కుండబద్దలు కొట్టాడు. విమెన్ కార్డుని అడ్డం పెట్టుకొని, ఈ నాటకానికి తెరతీసిందని మండిపడ్డాడు. ఆమె మతి లేకుండా మాట్లాడుతోందని, తనపై ఉన్న గౌరవం మొత్తం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆమె వద్ద ఎలాంటి సాక్ష్యాలూ లేవన్నాడు. తన కుటుంబం ఎప్పుడూ ఆమె వెన్నంటే ఉందని, ఆ విశ్వాసం కూడా లేకుండా అబద్ధపు ఆరోపణలు చేస్తోందని, ఇందుకు ఆమెని తాను ఎప్పటికీ క్షమించనని అన్నాడు. అసోపనే తన తోటి నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసిందని, అలాంటి ఆమె ‘చీటింగ్ చేస్తున్నానని’ తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నాడు. కరణ్, అసోప మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనేలా అతడు వ్యాఖ్యానించాడు.
నిజానికి తన భార్య అసోపకు ‘ట్రస్ట్ ఇష్యూస్’ ఉన్నాయని, తనకు కాదని రాజీవ్ తెలిపాడు. పైగా.. అనుమానం వచ్చేలా తన భార్య ప్రవర్తించిందన్నాడు. తాను ఏనాడూ తన భార్య గురించి కానీ, కుటుంబం గురించి మీడియా ముందు మాట్లాడలేదని.. ఇప్పుడు కూడా అసోప ఆరోపణలు చేసినందుకే తాను మీడియా ముందుకొచ్చానని పేర్కొన్నాడు. తను చాలా సెల్ఫిష్ అని, ఈ మేటర్‌లో తనని కాపాడుకోవడం కోసం తన కూతుర్ని సైతం అసోప వాడుకుందని చెప్పాడు. ఇకపై తాను అసోపతో కలిసి బతకాలని అనుకోవడం లేదని, తన భర్తపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే భార్యతో తాను జీవితాన్ని పంచుకోలేనని రాజీవ్ తేల్చి చెప్పేశాడు. మరి.. ఈ వ్యాఖ్యలకు చారు అసోప ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.