RajaBabu: నవ్వుకు చిరునామా… రాజబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజబాబు – ఈ నాలుగక్షరాలు పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు రాణించారు.
రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1937 అక్టోబర్ 20న రాజబాబు జన్మించారు. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ ఆయన కన్నవారు. ఆయనకు నలుగురు తమ్ముళ్ళు, ఐదుగురు అక్కాచెల్లెళ్ళు. రాజమండ్రిలో జన్మించిన రాజబాబు బాల్యం నుంచీ తన చేష్టలతో జనానికి వినోదం పంచేవారు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజాబాబు అంటూ పిలిచేవారు. తరువాతి రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించారు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్సు పూర్తిచేసి, కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు. అప్పుడు కూడా నాటకాలు వేస్తూ ఆకట్టుకొనేవారు. రంగస్థలంపై ఆయన “నాలుగిళ్ళ చావిడి, కుక్కపిల్ల దొరికింది” వంటి నాటకాలతో పేరు సంపాదించారు. జమున, అల్లు రామలింగయ్యను తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన గరికపాటి రాజారావు ఓ సారి రాజబాబు నటించిన నాటకం చూడటం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దాంతో ఆయన రాజబాబును మద్రాసు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టారు. ఆరంభంలో ట్యూషన్స్ చెప్పుకుంటూ గడిపారు రాజబాబు. ఏ సినిమాలోనైనా బిట్ రోల్ ఇచ్చినా, నటించడానికి వెనుకాడేవారు కాదు. 1960లో అడ్డాల నారాయణరావు అనే దర్శకుడు తాను తెరకెక్కించిన ‘సమాజం’ చిత్రంలో రాజబాబుకు అవకాశం కల్పించారు. తరువాత యన్టీఆర్ ‘ఆత్మబంధువు’లో సూర్యకాంతం కొడుకుగా నటించి, ఆకట్టుకున్నారు రాజబాబు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
‘బందిపోటు, మంచి మనిషి’ వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం, చలం వంటివారు కమెడియన్స్ గా రాజ్యమేలుతున్నారు. వారి మధ్య రాజబాబు రాణించడం కష్టం అని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకొని నవ్వించడం మొదలెట్టారు. సి.పుల్లయ్య రూపొందించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’లో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటులతో కలసి రాజబాబు తనదైన పంథాలో పకపకలు పంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది.
ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాలలోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. తెరపై రాజబాబు, రమాప్రభ జోడీ అనేక చిత్రాలలో ఎంతగానో నవ్వులు పూయించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా “తిరపతి, ఎవరికి వారే యమునా తీరే” వంటి చిత్రాలు రూపొందాయి. ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు. ‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ పతాకంపై రాజబాబు చిత్రాలు నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాలలో ‘ఎవరికి వారే యమునా తీరే’ మంచి విజయం సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘రాధమ్మ పెళ్ళి’ చిత్రంలో రాజబాబు, రమాప్రభ స్వయంగా “కాకినాడ రేవు కాడా ఓడెక్కి…” సాంగ్ పాడటం విశేషం. అంతే కాకుండా, కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవీ ఉన్నాయి.
అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డులు లేవు. అయితే రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు అవార్డులు ప్రదానం చేశాయి. మద్రాస్ ఆంధ్రా క్లబ్ రోలింగ్ షీల్డ్ ను వరుసగా ఐదు సంవత్సరాలు అందుకున్న ఘనత రాజబాబుదే. ఆయన, మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు. శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు సోదరి. అలాగే గాయని రమోల కూడా రాజబాబు భార్యకు తోబుట్టువు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా రాణించారు. తన చుట్టూ ఉన్నవారిని సదా నవ్విస్తూ కవ్విస్తూ సాగిన రాజబాబు, 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన స్థానం ఈ నాటికీ భర్తీ కాలేదు. రాజబాబు హాస్యం మాత్రం తెలుగువారి మదిలో నిలిచే ఉంది. జనానికి రాజబాబు హాస్యం గుర్తుకు వచ్చినపుడల్లా నవ్వులు వారి సొంతమవుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!