ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతాక విజేత, మాజీ బాక్సర్ డింగ్కో సింగ్ (42) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కాలేయ క్యాన్సర్‌తో ఆయన 2017 నుంచి పోరాడుతున్నారు. మణిపూర్‌కు చెందిన డింగ్కో సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంతాపం తెలిపారు. బాక్సింగ్ కోసం డింగ్కో సింగ్ చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం డింగ్కో సింగ్ నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఫిల్మ్ మేకర్ రాజా కృష్ణ మీనన్ బాక్సర్ డింగ్కో సింగ్ బయోపిక్ తీయాలని గతంలో ప్రయత్నించారు.
ఈ బాక్సర్ పాత్రను షాహిద్ కపూర్ చేయడానికి అంగీకరించాడు. ఇది రెండేళ్ళ క్రితం సంగతి. అందుకోసం అప్పట్లో డింగ్కో సింగ్ ను కలిసి ముచ్చటించానని, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి చేరలేదని రాజా కృష్ణ మీనన్ వాపోయాడు. డింగ్కో సింగ్ జీవితంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన సంఘటనలు బయటి వారికి తెలియనివి ఉన్నాయని, ఆయన సజీవునిగా ఉన్నప్పుడు రాసుకున్న కథనే యథాతథంగా ఇప్పుడైనా వెండితెరపై ఆవిష్కరించాలని ఉందని రాజా కృష్ణమీనన్ ఆరాటపడుతున్నాడు. మరి షాహిద్ కపూర్ సైతం ఈ విషయంలో పునరాలోచన చేసి, ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళతాడేమో చూడాలి.