Raj Kahani: రాజ్ కార్తికేయన్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రాజ్ కహాని’. ఈ సినిమాను భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర్గీయ చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియాపాల్, సాయి, ‘జబర్దస్త్’ ఫణి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ గురించి దర్శకుడు తెలియచేస్తూ, ‘తల్లిప్రేమను కొందరు అంతర్లీనంగా దాచుకుంటారు. అలానే ప్రియరాలి ప్రేమను బహిర్గతంగా చాటుకుంటారు. ఈ రెండింటి నేపథ్యంలో అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఇది” అని అన్నారు. కథ నచ్చడంతో ఈ సినిమాను హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలలోని అందమైన ప్రదేశాలలో నిర్మించామని, ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని, యు/ఎ సర్టిఫికెట్ లభించిందని చెప్పారు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.