కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది దాని ట్యాగ్ లైన్. కతిరేశన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు కతిరేశన్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 23న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సెకండ్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. శరత్ కుమార్, పూర్ణిమా భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
‘ఖుషీ’ సైతం డిసెంబర్ 23నే!
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ‘మహానటి’ తర్వాత రూపుదిద్దుకుంటున్న ‘ఖుషీ’ సినిమా సైతం డిసెంబర్ 23నే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు ఎర్నేని నవీన్, వై. రవిశంకర్ ఈ విషయాన్ని తెలియచేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఖుషీ’ మూవీ కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. మరి రెండు డిఫరెంట్ జానర్స్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలను దక్షిణాది ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటాయో చూడాలి!!
Bandi Sanjay: కేసీఆర్ ఎవరు? కోన్ కిస్కా.. బండి సంచలన వ్యాఖ్యలు..!