సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇక రాధిక, చిరంజీవి ల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జంటగా ఈ జంటకు మంచి పేరు ఉంది. అంతకుమించి వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. బయట పార్టీలో కలిసినా.. ఒకరింటికి మరొకరు వెళ్లిన ఈ ఈ స్నేహితులు ఇద్దరు చేసే సందడి అంతాఇంతా కాదు. అలాంటి స్నేహితుడి గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది రాధిక.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చిరు గురించి మాట్లాడుతూ ” చిరంజీవి ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్.. ఆయన తన కష్టంతో పైకి వచ్చారు. ఇప్పటికి అదే కష్టాన్ని నమ్ముతారు.. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా ఒదిగి ఉంటారు. అదే ఆయనలోని గొప్పతనం. మేము ఎప్పుడు కలిసినా చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేస్తుంటారు” అని చెప్పుకొచ్చింది. ఇక ఒకవేళ ఇప్పుడు చిరుతో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అని అడగగా.. చిరుకు విలన్ గా అయినా నటిస్తానేమో కానీ ఆయనకు తల్లి పాత్ర మాత్రం చేయలేను.. చిరుతో అలా నటించలేను అంటూ నవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.