ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విశ్వరూపం దాలుస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా పడింది. ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాల విడుదల వాయిదా పడుతున్నాయి. టాలీవుడ్ లో దాని ప్రభావం ‘ఆర్.ఆర్.ఆర్.’ పై పడింది. వరల్డ్ వైడ్ గా జనవరి 7న విడుదల కావలసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టారర్ రిలీజ్ వాయిదా ఖాయమని తెలుస్తోంది. ఇది వేసవిలో రిలీజ్ అవుతుందని వినిపిస్తోంది. నిజానికి గత కొన్నాళ్ళుగా ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘రాధేశ్యామ్’ సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే రాజమౌళి అండ్ కో ఆన్ని భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ వచ్చారు. అయితే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఒక్కో రాష్ర్టంలో థియేటర్ల ఆక్యుపెన్సీ 50 శాతానికి కుదించటంతో పాటు నైట్ కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో రాత్రి షోస్ కు గట్టి ఎఫెక్ట్ పడనుంది. అటు అంతర్జాతీయంగానూ పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండటం కూడా పాన్ ఇండియా సినిమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లది మరో సమస్య. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ మంచి వసూళ్ళు చూసినా, పలు చోట్ల బ్రేక్ ఈవెన్ రేంజ్ కి చేరుకోకపోవడం కూడా అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం మొదటివారంలో టిక్కెట్ రేట్లు పెంచుతుందనే ఆశాభావంతో ఉంది టాలీవుడ్. అయితే కమిటీ వేసిన ప్రభుత్వం, ఆ కమిటీ తొలి ఆన్ లైన్ మీటింగ్ లో అలాంటి సూచనలేవీ ఇవ్వకపోగా జనవరి 11న వ్యక్తిగతంగా మీట్ అయి కూలంకషంగా చర్చించిన తర్వాతే టికెట్ రేట్లపై తగిన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ వైపు ఒమిక్రాన్ విజృంభణ, మరో వైపు టిక్కెట్ రేట్ల తగ్గింపు, పరిమిత షోస్ వంటి అంశాలు… నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకునేలా చేస్తున్నాయి. ‘రాధేశ్యామ్’ నిర్మాతలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ 14న విడుదల అని మరోసారి ప్రకటించారు. కానీ ఇన్ సైడ్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే కొందరు ‘రాధేశ్యామ్’ ఓటీటీలో విడుదల అవుతుందంటున్నారు. నిజానికి దీన్ని కూడా కొట్టి పారేయలేం. ఎందుకంటే ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎంత? అది ఎంత కాలం ఉంటుంది? అనే దానిలో స్పష్టత లేదు. డేట్ ఎటూ ప్రకటించి ఉన్నారు కాబట్టి అదే డేట్ కి మంచి ఆఫర్ పలకరిస్తే ఓటీటీలో విడుదల చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికి మాత్రం నిర్మాతలు థియేటర్స్ లోనే విడుదల చేస్తామనీ, అదీ 14ననే అని ప్రకటించారు.
ఇదిలా ఉంటే సంక్రాంతికి విడుదల కావలసి ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘రాధేశ్యామ్’ కోసం విడుదలను వాయిదా వేసుకున్న ‘భీమ్లా నాయక్’ మళ్ళీ రంగంలోకి దిగాడట. ‘ఆర్.ఆర్.ఆర్.’ పోస్ట్ పోన్ అని తేలటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంతో పూర్తి చేస్తున్నారు. సో ‘భీమ్లా నాయక్’ ను జనవరి 12న విడుదల చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఈ గందరగోళం అంతా తొలిగి సినిమా విడుదలపై స్పష్టత రావాలంటే ఒకటి రెండు రోజులు ఆగక తప్పదు