రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రెండు మ్యూజిక్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తారాది ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలువురు అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలన్నింటికీ అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన ‘సంచారి…’ పాట కూడా బాగా పట్టేసింది.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అబిమానులే అతిథులుగా డిసెంబర్ 23న జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుకలో 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేస్తారు. అభిమానుల చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం ఈ వేడుకలో పాల్గొననుంది. జనవరి 14, 2022న సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.