ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయం ఇంకా నానుతూనే ఉంది. సంక్రాంతి వరకైనా ప్రభుత్వం ఈ విషయంలో కనికరిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు మేకర్స్. చాలాచోట్ల ఇప్పటికే థియేటర్లు కూడా మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుతాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించగా, అపాయింట్మెంట్ దొరకలేదని టాక్ విన్పిస్తోంది. అయితే తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలో ఇద్దరు థియేటర్ యజమానులు కలిశారు. తమ థియేటర్ లపై తీసుకుంటున్న చర్యల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లగా… జిల్లా జాయింట్ కలెక్టర్ కు పెనాల్టీ కట్టి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు.
ఇక ఈ క్రమంలోనే మంత్రి నానితో సినీ నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి భేటీ కావడం గమనార్హం.టికెట్ల అంశంపై ఈ మధ్య ఓ సినీ వేదికపై స్పందించిన నారాయణ మూర్తి ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని బహిరంగంగా అప్పీల్ చేశాడు. ఈ నేపథ్యంలో మంత్రితో నారాయణమూర్తి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని విషయాలు పర్సనల్ గా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చాను అని ఆర్ నారాయణమూర్తి అన్నారు.