ప్రముఖ పంజాబీ సింగర్ దలెర్ మెహందీకి మరోసారి జైలు తప్పలేదు.. మానవ అక్రమ రవాణా కేసులో గత కొన్నేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్న ఈ సింగర్ కు పటియాలా కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. దలెర్ మెహందీ, అతని తమ్ముడు షంషేర్ సింగ్ కలిసి ఒక మ్యూజికల్ ట్రూప్ పేరుతో దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు. ఆ ట్రూప్ పేరు చెప్పి పాస్ పోర్టు లాంటివి ఏమి లేకుండా కొంతమంది మనుషులను అమెరికాలో వదిలేశారు.
ఇక దానికి వారి దగ్గరనుంచి లక్షల్లో డబ్బును తీసుకున్నారు. ఇలా పదిమంది వ్యక్తులను అక్రమ రవాణా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు 2013 లో వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో దలెర్ కు వ్యతిరేకంగా 35 కేసులు నమోదు కావడంతో కోర్టు వీరికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. కొన్నేళ్లు జైల్లో ఉన్న ఈ అన్నదమ్ములు ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చారు. కాగా బెయిల్ గడువు ముగియడంతో బెయిల్ పొడిగించాలని ఈ అన్నదమ్ములు కోర్టులో వేసిన పిటిషన్ ను తాజాగా కోర్టు తిరస్కరించింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి పటియాలా జైలుకు తరలించనున్నారు.