ఈ నెల చివరి వారంలో, వచ్చే నెల మొదటి వారంలో బాక్సాఫీస్ బరిలో బిగ్ క్లాష్ చోటు చేసుకోబోతోంది. ఈ నెలాఖరులో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే… ఈ నెల 30న మణిరత్నం మాగ్నమ్ ఓపస్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్ -1’ (పీఎస్ 1) ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాపై తమిళ సినిమా రంగం భారీ ఆశలే పెట్టుకుంది. కానీ చిత్రంగా ఈ మూవీకి ఒక రోజు ముందు ధనుష్ నటించిన ‘నానే వరువేన్’ వస్తుందని అంటున్నారు. కలైపులి ధాను నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేయబోతోంది. మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్ 1’ను తెలుగులో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు.
నిజానికి ఈ మధ్య కాలంలో మన నిర్మాతలు ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదల కాకుండా ఉంటే బాగుంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ బరిలో అలాంటి క్లాష్ జరగకుండా ముందే సంప్రదింపులు జరిపి, నిర్మాతలను ఒప్పిస్తున్నారు. మరి ఈ రెండు పెద్ద డబ్బింగ్ సినిమాల విషయంలో ఇద్దరు పెద్ద నిర్మాతలూ ఎందుకు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారో తెలియదు! అయితే… ఈ రోజున ధనుష్ మూవీ తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేయబోతోందని ప్రకటించిన నిర్మాత కలైపులి థాను… రిలీజ్ డేట్ ను పేర్కొనకుండా సెప్టెంబర్ లో విడుదల అని మాత్రమే ప్రకటించారు. ఒకవేళ ‘పొన్నియన్ సెల్వన్’తో పోటీ పడకూడదనుకుంటే… ‘నేను వస్తున్నా’ మూవీ మరో రోజుకు వెళ్ళే ఆస్కారం ఉంది.
