Tollywood: ఆగస్ట్ 1 నుండి సినిమాల షూటింగ్స్ బంద్ చేయాలనే నిర్ణయానికి మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా షూటింగ్స్ ఆపేసి, అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాలనే మాట బాగా వినిపిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడే కుదురుకుంటున్న టైమ్ లో తిరిగి షూటింగ్స్ ను బంద్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు నిర్మాతలు చెబుతున్నారు. దాంతో మధ్యే మార్గంగా కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టకూడదని, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్ ను మాత్రం ఆపేద్దామని నిర్మాతలు చెప్పారని తెలుస్తోంది. సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నాలుగు సెక్టార్లకు చెందిన ప్రతినిధులు పాల్గొని చర్చించినా, ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోయారు. ఈ విషయమై 27 మంది సభ్యులతో ఓ కమిటీ వేయాలనే నిర్ణయం మాత్రం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం తెలుగు చిత్రసీమకు చెందిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో సమావేశం అయ్యారు. అందులో మెజారిటీ సభ్యులు ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ ను బంద్ చేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని రేపు ఛాంబర్ కార్యవర్గం ముందు పెట్టి, వారినీ ఈ విషయమై ఒప్పించాలని గిల్డ్ సభ్యులు భావిస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే ఆగస్ట్ 1 నుండి సినిమాల షూటింగ్స్ బంద్ కావడం ఖాయం. ఒకసారి వాటిని ఆపితేనే పరిస్థితులు చక్కబడతాయని మెజారిటీ నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ అగ్ర నిర్మాతలే ఇప్పుడు ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నారు. అన్ని రకాలుగా సమస్యలు పడుతోంది తామే కాబట్టి, ఓ అడుగు ముందుకేసి ఏదో ఒక పరిష్కారం పొందాలన్నది వీరి ఆలోచన అంటున్నారు. అదే జరిగితే మాత్రం… చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు యంగ్ స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ కూ బ్రేక్ పడుతుంది. మరి ఈ సంక్లిష్టలమైన ఈ సమస్యకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి పరిష్కారం ఆలోచిస్తుందో చూడాలి.