Naga Chaitanya: దాదాపు రెండు దశాబ్దాలుగా ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్నారు శ్రీనివాస చిట్టూరి. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘యూ టర్న్’తో నిర్మాతగా మారిన శ్రీనివాస అక్కడ నుండి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ మధ్య రామ్ తో ద్విభాషా చిత్రం ‘వారియర్’ను నిర్మించిన శ్రీనివాస ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నాగచైతన్యతో ‘కస్టడీ’ని నిర్మించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇదే నెల 12న విడుదల కాబోతున్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమాలో నచ్చిన అంశాల గురించి మాట్లాడుతూ, ”ఇది నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ కథ. రూరల్ పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ కథ, స్క్రీన్ ప్లే నన్ను ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో సీరియస్ గా కథ జరుగుతుంటుంది. అయితే సీరియస్ లో కూడా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. ఈ రెండిటిని దర్శకుడు మిక్స్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది” అని అన్నారు.
కథ వినగానే ఈ సినిమాకు ‘శివ’ అనే పేరు పెడితే బాగుంటుందని, దర్శకుడితో పాటు తాను అనుకున్నానని చెబుతూ, “నాగార్జున గారి కెరీర్ లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్ లో ‘కస్టడీ’ అలా గుర్తుండిపోతుంది. ‘శివ’ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. ‘కస్టడీ’లోని అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రతి పాత్ర యూనిక్ గా వుంటుంది. దీనికి ‘శివ’ అనేదే యాప్ట్ టైటిల్ అనిపించింది. కానీ చైతు గారు పోలికలు వస్తాయి వద్దు” అన్నారు. వెంకట్ ప్రభును దర్శకుడిగా ఎంపిక చేయడం గురించి చెబుతూ, “‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి వెంకట్ ప్రభుతో ఓ మూవీ చేయాలని అనుకున్నాను. తన స్క్రీన్ ప్లే, ఆలోచించే విధానం నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ ని కూడా మంచి స్క్రీన్ ప్లే లో ఎంటర్ టైన్ మెంట్ గా చెప్పగలరు. అరవింద్ స్వామి గారు ఈ కథ వినగానే మరో ఆలోచన లేకుండా మూవీ చేస్తానని చెప్పారు. థియేటర్ లో ఆయన పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. టెర్రిఫిక్ గా అదే సమయంలో చాలా ఎంటర్టైనింగ్ గా వుంటుంది ఆయన పాత్ర. శరత్ కుమార్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. రెండు కొండల మధ్య చిట్టెలుక వుంటే ఎలా వుంటుందో అరవింద్ స్వామి, శరత్ కుమార్ మధ్య నాగచైతన్య పాత్ర అలా కనిపిస్తుంది. ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు” అని చెప్పారు. కృతిశెట్టి మంచి ఆర్టిస్ట్. చాలా చక్కని నటన కనబరిచింది” అని అన్నారు.
ఇద్దరు సంగీత దర్శకులను పెట్టడానికి రీజన్ చెబుతూ, “ఇది 90లో జరిగే కథ. ఇలాంటి సినిమాకి నేపధ్యం సంగీతం ఇళయరాజా గారు ఇస్తే బావుంటుందని ఆయన్ని తీసుకోవడం జరిగింది. కథ వినగానే ఇళయరాజా గారు, యువన్ మేము చేస్తామని ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది” అని అన్నారు. బడ్జెట్ వేసుకోకుండా ‘కస్టడీ’ సినిమాను నిర్మించానని, నాగచైతన్య చిత్రాలలో అత్యధిక స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతోందని చెప్పారు. తన ఇతర ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ, ‘రామ్ -బోయపాటి మూవీ షూటింగ్ సాగుతోందని, నాగార్జునతో చేయబోతున్న సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళుతుందని, చైతుతో మరో సినిమా తీయబోతున్నానని తెలిపారు.