‘ఈ తరం పిక్చర్స్’ అధినేత పోకూరి బాబూరావు చిత్రాలను గుర్తు చేసుకుంటే, ఆయన అభిరుచి ఏమిటో ఇట్టే అర్థమై పోతుంది. ఆయన సినిమాల్లో అభ్యుదయ భావాలు దర్శనమిస్తాయి. సామాన్యుల పక్షం నిలచి, తన సినిమాల ద్వారా వారిలో ధైర్యం నింపిన పోకూరి బాబూరావు నైజం ఆకర్షిస్తుంది. కమర్షియల్ ఫార్ములా మిస్ కాకుండానే తన అభిరుచికి తగ్గ చిత్రాలతో పోకూరి బాబూరావు జనాన్ని ఆకట్టుకున్నారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట పోకూరి బాబూరావు స్వస్థలం. 1950 డిసెంబర్ 7న ఆయన జన్మించారు. ఆయన తండ్రి పోకూరి శేషయ్య, తల్లి నాగేశ్వరమ్మ. శేషయ్య కృషితో నాస్తి దుర్భిక్షమ్ అని నమ్మేవారు. అలాగే అంచెలంచెలుగా ఎదిగి ఓ సామాన్య రైతు నుండి పొగాకు వ్యాపారిగా, థియేటర్ యజమానిగా, హోటల్ ప్రొప్రైటర్ గా ఎదిగారు. తండ్రిలోని పట్టుదలే బాబూరావులోనూ ఉండేది. అలాగే ఆయన తల్లి భక్తిగీతాలను, సినిమా పాటలను ఆలపించేవారు. అలా ఆయనకు సినిమాలపై ఆసక్తి నెలకొంది. చదువుకొనే రోజుల్లో మిత్రులతో కలసి సినిమాల గురించి చర్చిస్తూ ఉండేవారు పోకూరి బాబూరావు. ఒంగోలులో హైస్కూల్ దాకా చదువుకున్న బాబూరావు, విజయవాడలో పి.యు.సి. చదివారు. ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ కాలేజ్ లో బి.కామ్., చదివే సమయంలో టి.కృష్ణతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరి భావాలు కలవడంతో మంచి మిత్రులయ్యారు. కాలేజ్ లో ప్రత్యేక ఉత్సవాల్లో ఇద్దరూ కలసి పాటలు పాడేవారు. నాటకాలు వేసేవారు. చదువు పూర్తయ్యాక టి.కృష్ణ మద్రాసు చేరి, అక్కడ గుత్తా రామినీడు వద్ద అసోసియేట్ గా పనిచేశారు. అయితే సినిమా రంగం నచ్చక తిరిగి వచ్చేశారు. బాబూరావు ఎమ్.కామ్ పూర్తి చేసి, ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగంలో చేరారు. మిత్రులిద్దరూ తరచూ కలుసుకొనేవారు. బాబూరావు, టి.కృష్ణ ఇద్దరూ ‘ప్రజానాట్యమండలి’వైపు ఆకర్షితులయ్యారు. అక్కడే మాదాల రంగారావుతో పరిచయం ఏర్పడింది. మాదాల ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని నిర్మించే సమయంలో బాబూరావు, టి.కృష్ణ ఆ సినిమాకు పనిచేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. మాదాలతో కలసి “విప్లవశంఖం, ఎర్రమల్లెలు” చిత్రాలకు కూడా బాబూరావు, కృష్ణ పనిచేశారు.
ఆ తరువాత మిత్రులిద్దరూ కలసి ‘ఈ తరం పిక్చర్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘నేటి భారతం’ నిర్మించారు. టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాబూరావు సోదరుడు వెంకటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించేవారు. టి.కృష్ణ దర్శకత్వంలోనే “దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు” చిత్రాలు నిర్మించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. దాంతో సినిమా రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించి, బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆపై విజయశాంతితో ‘భారతనారి’ నిర్మించగా, ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. రాజశేఖర్ కథానాయకునిగా ‘అన్న’, ‘ప్రజాస్వామ్యం’, ‘మా ఆయన బంగారం’ చిత్రాలను, మీనా ప్రధాన పాత్రలో ‘అమ్మాయి కోసం’ నిర్మించగా, అన్నీ జనాదరణ పొందాయి. రాజేంద్రప్రసాద్ కు ఉత్తమనటునిగా తొలి నంది అవార్డు సంపాదించి పెట్టిన ‘ఎర్రమందారం’ చిత్రాన్నీ బాబూరావే నిర్మించారు.
టి.కృష్ణ మరణానంతరం ఆయన తనయులు ప్రేమ్ చంద్, గోపీచంద్ బాగోగులు చూశారు బాబూరావు. ప్రేమ్ చంద్ దర్శకుడు కావాలన్న అభిలాషతో ఉన్న సమయంలోనే ఓ ప్రమాదంలో మరణించారు. గోపీచంద్ చదువు పూర్తి చేసుకువచ్చాక, తొలుత ‘తొలివలపు’ లో హీరోగా నటించారు. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. దాంతో “జయం, నిజం, వర్షం” వంటి చిత్రాలలో ప్రతినాయకునిగా నటించి, మంచి మార్కులు సంపాదించారు గోపీచంద్. తరువాత గోపీచంద్ హీరోగా బాబూరావు ‘యజ్ఞం’ చిత్రం నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. గోపీచంద్ హీరోగా నిలదొక్కుకున్నారు. తరువాత బాబూరావు నిర్మించిన ‘రణం’ లోనూ గోపీచంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. గోపీచంద్ తో బాబూరావు నిర్మించిన మూడవ చిత్రం ‘ఒంటరి’. ఆ పై తనీశ్ హీరోగా ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ నిర్మించిన బాబూరావుకు ఆ సినిమా నిరాశ కలిగించింది. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు బాబూరావు. అయినా ఆయన నిర్మించిన చిత్రాలు అడపాదడపా బుల్లితెరపై ప్రత్యక్షమై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
బాబూరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుకొనే రోజుల్లోనే గాయకునిగా గళం విప్పిన బాబూరావు తరువాతి రోజుల్లో “స్వరాజ్యం, ఎర్రమందారం” వంటి చిత్రాలలో కొన్నిపాటల్లో తన గాత్రం వినిపించారు. ‘యువతరం కదిలింది’లో ఓ చిన్న పాత్ర పోషించిన బాబూరావు తరువాతి రోజుల్లో “నవయుగం, ప్రేమతపస్సు, రగులుతున్న భారతం” వంటి చిత్రాలలో కీలక పాత్రలు ధరించారు. మాదాల రంగారావు ‘నవతరం పిక్చర్స్’ చిత్రాల రూపకల్పనలో పాలుపంచుకొని, తరువాత మిత్రుడు టి.కృష్ణతో కలసి ‘ఈ తరం పిక్చర్స్’ నెలకొల్పి ప్రేక్షకాదరణ పొందే చిత్రాలను నిర్మించి అలరించారు బాబూరావు. తన అభిరుచికి తగ్గ చిత్రాలతో జనాన్ని ఆకట్టుకున్న బాబూరావు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.