Producer Dil Raju Clarity On Varisu Shooting Controversy: ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఈరోజు (ఆగస్టు 1) నుంచి తెలుగు సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. చిన్న, మీడియం, భారీ బడ్జెట్ అని తేడా లేకుండా.. అన్ని చిత్రబృందాలు ఆ నిర్ణయానికి కట్టుబడి షూటింగ్స్ ఆపేశాయి. కానీ.. ‘వరిసు’ (వారసుడు) షూటింగ్ మాత్రం వైజాగ్‌లో కొనసాగుతోంది. ఆదివారం ఫిల్మ్ ఛాంబర్‌లో.. సినీ పరిశ్రమ సమస్యలకు పరిష్కారం దొరికే వరకూ షూటింగ్‌లను తిరిగి ప్రారంభించబోమని చెప్పిన నిర్మాత దిల్‌రాజునే, తన ‘వరిసు’ షూటింగ్ కొనసాగించడంతో ఇండస్ట్రీలో గందరగోళ వాతావరణం నెలకొంది.
సమస్యల పరిష్కారం కోసం బంద్‌కు పిలుపునిచ్చినా.. ఇలా ఎలా షూటింగ్స్ కొనసాగిస్తారంటూ పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మండిపడ్డారు. అయితే.. ఇది చినికి చినికి గాలివానగా మారకముందే, నిర్మాత దిల్ రాజు ముందుకొచ్చి ‘వరిసు’ షూటింగ్ నిర్వహించడంపై క్లారిటీ ఇచ్చాడు. ‘‘తెలుగు సినిమాల చిత్రీకరణలు మాత్రమే బంద్. నేను విజయ్‌తో తీస్తోన్న ‘వరిసు’ తమిళ చిత్రం. అది మాత్రమే షూటింగ్ జరుగుతోంది. తెలుగులో నేను ఎలాంటి సినిమాల షూటింగ్స్ నిర్వహించడం లేదు’’ అంటూ దిల్ రాజు స్పష్టత నిచ్చారు. దిల్‌రాజు ఇచ్చిన లాజికల్ సమాధానం ప్రకారం.. పాన్ ఇండియా సినిమాలన్నీ తెలుగు భాష మినహా, ఇతర భాషల్లో చిత్రీకరణలు జరుపుకోవచ్చా? అంటే కాదనే, అది రిస్కీ ఫీట్ అవుతుందనే చెప్పుకోవాలి.
ఇక్కడో విషయం చెప్పుకోవాలి.. మొదట్నుంచీ ప్రచారం జరుగుతున్న ‘వరిసు’ బైలింగ్వల్ సినిమా కాదు. కేవలం తమిళంలో మాత్రమే దీనిని చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా డబ్ చేస్తున్నారు. సో, దిల్ రాజు చెప్పిన లాజిక్ ప్రకారం ‘వరిసు’ షూటింగ్ కొనసాగించవచ్చు. పాన్ ఇండియా సినిమాల విషయానికొస్తే.. అన్నీ భాషల్లో ఒకేసారి షూట్ చేస్తారు. తెలుగు మినహాయించి ఇతర భాషల్లో చేస్తే, మరోసారి తెలుగులో షూట్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఒక రకంగా ఇది హైపోథెటికల్ విషయం!