Dil Raju: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు అందివ్వడం కోసం ప్రొడ్యూసర్ గిల్డ్ సతమతమవుతున్న విషయం విదితమే. చిత్ర పరిశ్రమ సమస్యలపై గత 20 రోజులుగా ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ ఆపేసి మరీ ప్రొడ్యూసర్ గిల్డ్ చర్చలు కొనసాగిస్తున్నాయి. ఇక నేడు జరిగిన సమావేశంలో నిర్మాణ వ్యయం తగ్గింపు, కార్మికుల వేతనాల పెంపు, ఓటీటీ లో సినిమాల విడుదల గడువు పెంపు, సినిమా టికెట్ ధరల నియంత్రణ, నటీనటుల రెమ్యూనరేషన్ కుదింపు తదితర అంశాలపై ప్రొడ్యూసర్ గిల్డ్ చర్చించి కీలక నిర్ణయం తీసుకొంది.
ఇక ఈ సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ ” కేవలం మూడు క్రాఫ్ట్ లు మినహా మిగతా అందరితోనూ చర్చలు సఫలం.. వారితో కూడా ఆగస్టు 30 లోపు ఒక అవగాహనకు వచ్చి అదే రోజు మీడియా కు పూర్తి వివరాలు అందిస్తాం. ఛాంబర్ అప్రూవల్ ఇచ్చిన చిత్రాలు మాత్రమే ఈ నెల 25 నుండి షూట్ జరుపుకొంటాయి. మిగతా సినిమాలు అన్ని సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 30 న పూర్తి వివరాలు తెలియజేస్తాం” అని చెప్పుకొచ్చారు. దీంతో కొంతవరకు పెద్ద సినిమాలకు ఊరట కలిగిందనే చెప్పాలి.