టబు, వినీత్, అబ్బాస్ లు కలిసి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా ‘ప్రేమదేశం’.. అప్పటివరకు రొటీన్ లవ్ స్టోరీ కథలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా ప్రేమను, స్నేహాన్ని చూపించే కోణాన్నే మార్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే రాబోయే తరం ప్రేమ కథలను ఇరువై ఏళ్లకు ముందే ఈ చిత్రం చెప్పేసింది. తమిళంలో ‘కాదల్ దేశం’ చిత్రంగా రాగా తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ విజయవంతం అయింది. ఎ.ఆర్.రహమాన్ స్వరకల్పనలో రూపొందిన పాటలు విశేషంగా అలరించాయి. ‘ముస్తఫా .. ముస్తఫా’.. ‘నను నేను మరిచినా’ పాటలకు ఇప్పటికీ ఆదరణ వుంది. కాగా, ఇటీవలే ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తిచేసుకోంది. అయితే ఈ సినిమాపై తాజాగా స్పందించిన దర్శకుడు కదిర్ సీక్వెల్ పై మాట్లాడుకొచ్చారు.
దర్శకుడు కదిర్ మాట్లాడుతూ.. ‘ప్రేమదేశం సినిమాకు సంబంధించిన సీక్వెల్ కథపై చర్చలు జరుగుతున్నామని ఇప్పటికే స్క్రిప్టు కూడా సిద్ధమైందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని కూడా వివరణ ఇచ్చారు’. ప్రస్తుతం ప్రొడ్యూసర్ తో చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కదిర్ ఇదివరకే ఈ సినిమా సీక్వెల్ ను తీసుకొద్దామనుకున్న అది కుదరలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా వచ్చేటట్లే కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే హీరోలు, హీరోయిన్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది.