తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ మించి పోటాపోటీగా జరిగి పోటీ చేసిన రెండు ప్యానెల్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అధ్యక్షులుగా పోటీపడిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు సైతం విమర్శల దాడి చేసుకున్నారు. ఆ హోరా హోరీ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్, విష్ణు ఎదురెదురు పడిన సందర్భం లేదు.
అయితే బుధవారం యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రకాశ్ రాజ్, విష్ణు. వేదికపై వీరిద్దరూ కలసి ముచ్చటిస్తుండగా మధ్యలో వింటున్న హీరో విశ్వక్ సేన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రారంభానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై క్లాప్ కొట్టారు. మరి ప్రకాశ్ రాజ్, విష్ణు మధ్య ఏం డిస్కషన్ నడిచిందన్నది తెలియరాలేదు. తప్పకుండా ఇండస్ట్రీలో జరుగుతున్న కార్మికుల సమ్మె గురించే అయి ఉండవచ్చు.