Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈశ్వర్ సినిమాకు ముందు ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ, అతడిని నిలబెట్టింది.. అతని పెదనాన్న కృష్ణంరాజు. ధైర్యం నేర్పింది.. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో చెప్పింది.. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ప్రభాస్ వెన్నంటి ఉన్న నేస్తం కృష్ణంరాజు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, శత్రువు ఇంటికి వచ్చినా భోజనం పెట్టి పంపించాలని, ఇండస్ట్రీలో గొడవలు పెట్టుకోకూడదని ఒకటి ఏమిటీ.. ప్రభాస్ ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం కృష్ణంరాజు మాత్రమే.. ఆ విషయాన్నీ ప్రభాస్ ఎన్నోసార్లు.. ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చాడు. తన పెదనాన్నే తన దైవమని తెలిపాడు. అలాంటి దైవాన్ని, తన ధైర్యాన్ని గతేడాది ప్రభాస్ పోగొట్టుకున్నాడు. కృష్ణంరాజు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసిన విషయం తెల్సిందే.. ఎప్పుడు నవ్వుతు ఉండే ప్రభాస్ ను అభిమానులు కన్నీళ్లతో చూసిన క్షణం అది.. ఇక ఇప్పుడిప్పుడే ప్రభాస్ ఆ విషాదం నుంచి బయటికి వస్తున్నాడు. ఈ మధ్యనే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్ సందడి చేశాడు. ఈ బాహుబలి ఎపిసోడ్ ను మేకర్స్ రెండు భాగాలుగా రిలీజ్ చేసారు. ఇప్పటికే మొదటి భాగం స్ట్రీమింగ్ అవ్వగా.. రెండో భాగం జనవరి 6 న స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్.. పెదనాన్న కృష్ణంరాజును తలుచుకొని కంటతడి పెట్టాడు. ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ రావడంతో మొదలైన ఎపిసోడ్ 2 .. కృష్ణంరాజు మృతికి నివాళి అర్పిస్తూ కొనసాగింది. బాలయ్య.. పెదనాన్నతో నీ అనుబంధం గురించి చెప్పు అని అడగడంతో ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. ” ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే అది ఆయన వల్లే.. నేను ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాను. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్‌ని ప్రారంభించి, లేడి ఓరియెంటెడ్ సినిమాలు తీసి టాలీవుడ్ లో చరిత్ర సృష్టించారు. ఈరోజు మా కుటుంబం అంతా ఆయన్ను చాలా మిస్సవుతున్నారు” అని కంటతడి పెట్టుకున్నాడు. ఇక కృష్ణంరాజు మృతి గురించి ప్రభాస్ మాట్లాడుతూ..” ఆయన నెల రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గరే నేను ఉన్నాను.. నిరంతరం వైద్యులతో టచ్ లో ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య సైతం కృష్ణంరాజును గుర్తుచేసుకున్నారు. ” నేను టర్కీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ వార్త తెల్సింది.. నేను కృష్ణంరాజును తలుచుకొని ఎంతో ఏడ్చాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అభిమానులందరూ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.