స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? మరీ ముఖ్యంగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చన్నది దర్శకుల భావన. అందుకే.. తమ వద్ద ఉన్న స్క్రిప్టులు తీసుకొని, ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ ఆరడుగుల ఆజానుభావుడు కూడా.. చేతినిండా సినిమాలున్నా, నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోతున్నాడు. ఒకవేళ స్టోరీ నచ్చకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ తమిళ దర్శకుడి స్టోరీని ప్రభాస్ తిరస్కరించినట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ తమిళ దర్శకుడు ఎవరనేగా మీ సందేహం? మరెవ్వరో కాదు.. లోకేష్ కనగరాజ్. ‘ఖైదీ’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడితో.. విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు ముందుకొచ్చారు. విజయ్ మరోసారి అతనితో సినిమా చేయబోతున్నాడు. ఇక్కడ రామ్ చరణ్‌తోనూ ఓ పాన్ ఇండియా సినిమాకి పెద్ద ప్రణాళికలు రచిస్తున్నాడు. దీన్ని బట్టి, ఇతనికి మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి డైరెక్టర్‌ని ప్రభాస్ రిజెక్ట్ చేసేశాడు. స్టోరీ నచ్చకపోవడం వల్లే! కొన్నాళ్ళ క్రితం ఓ కథతో ప్రభాస్‌ని లోకేష్ కలిశాడు. ఆ స్టోరీ అంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో, కొన్ని మార్పులు సూచించాడట! మార్పులు చేశాక కథ వినిపిస్తే, అది కూడా నచ్చకపోవడంతో ప్రభాస్ రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అయితే.. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది. చేతిలో చాలా సినిమాలు ఉండటం, అవి ఎప్పుడు పూర్తవుతాయో సరిగ్గా క్లారిటీ లేకపోవడం వల్లే.. లోకేష్ సినిమాని ప్రభాస్ తిరస్కరించినట్టు చెప్పుకుంటున్నారు. సలార్ మొదట్లో సింగిల్ పార్ట్ అనుకుంటే, అదిప్పుడు రెండు భాగాలుగా రూపొందుతోంది. ప్రాజెక్ట్ కే పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది. మధ్యలో మారుతి సినిమా ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే, తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాలని ప్రభాస్ డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.