ఆలిండియా స్టార్ ప్రభాస్ లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో.. దర్శకుడు మారుతి సినిమా ఒకటి. వీరి కాంబోలో సినిమా ఉండనుందన్న వార్తొచ్చి చాలాకాలమే అవుతున్నా.. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంపైనే స్పష్టత రాలేదు. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట! తక్కువ బడ్జెట్‌లోనే ఈ సినిమా రూపొందనుంది కాబట్టి, ఎక్కువ సమయం వృధా చేయకుండా చకచకా చిత్రీకరణను ముగించేలా మారుతి ప్రణాళికలు నిర్వహించినట్టు తెలిసింది. మాళవిక మోహనన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడు.
మరోవైపు.. ప్రభాస్ చేస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడో ముగిసింది. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో, వచ్చే ఏడాదిలో రిలీజ్‌కి ప్లాన్ చేశారు. అటు, సలార్ చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ కే’ షూట్‌లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. అయితే.. ఈ సినిమా షూట్ మాత్రం నిదానంగానే సాగుతోంది. 2024లో రిలీజ్‌కి ప్లాన్ చేశారు కాబట్టి, మెల్లగా పనులు కానిస్తున్నారు. మిగతా రెండు చిత్రాలు మాత్రం వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కి ముస్తాబవుతున్నాయి. మారుతి సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.