Site icon NTV Telugu

Unstoppable 2: రేపే ‘అన్‌స్టాపబుల్‌’లో ప్రభాస్-గోపీచంద్

Unstoppable 2

Unstoppable 2

Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ సైతం జనాన్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్‌లోనూ పలువురు సెలబ్రిటీస్‌తో బాలయ్య చేసిన సందడి భలే వినోదం పంచింది. రాబోయే ఎపిసోడ్లలోనూ అదే తీరున సాగనుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం డిసెంబర్ 11న చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఎపిసోడ్ శుక్రవారం అంటే డిసెంబర్ 16న ప్రసారం కానుంది. ప్రభాస్‌తో సాగే అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో యంగ్ రెబల్ స్టార్‌కు మంచి మిత్రుడైన మరో స్టార్ గోపీచంద్ కూడా మధ్యలో జాయిన్ కానున్నారు.

Read Also: Unstoppable: సన్నీతో ‘అన్ స్టాపబుల్’ అంటున్న డైమండ్ రత్నబాబు!

ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగునేలను విశేషంగా అలరించి.. ఆ తరువాత రాజకీయాల్లోనూ తమదైన బాణీ పలికించిన ‘జయ’ద్వయం – జయప్రద, జయసుధతోనూ బాలయ్య ‘అన్ స్టాపబుల్’ సాగనుంది. ప్రభాస్ ఎపిసోడ్ తరువాత జయప్రద, జయసుధతో ఎపిసోడ్ రూపొందనున్నట్టు సమాచారం. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు హిట్ పెయిర్స్‌గా నిలిచిన జయప్రద, జయసుధ ఇద్దరితోనూ బాలకృష్ణ నటించారు. అయితే వీరిలో జయసుధ ఒక్కరే ‘అధినాయకుడు’లో ఆయనకు జోడీగా కనిపించారు. బాలకృష్ణ ‘మహారథి’లో ఆయనకు అత్త పాత్రలో జయప్రద కనిపించారు. మరో విశేషమేమంటే.. ఈ ఇద్దరు నాయికలు ఎన్టీఆర్ దర్శకత్వంలో ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో నటించారు. అందులో ఇద్దరితోనూ నారదుని పాత్ర దరించిన బాలయ్యకు సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి ఈ ‘జయ’ద్వయం బాలయ్య వర్ధమాన నటునిగా ఉన్న సమయంలోనే ఆయనతో జోడీ కట్టాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఇలాంటి ముచ్చట్లన్నీ ఆ ఎపిసోడ్‌లో చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్‌తో ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ నవతరం వారికి ఖచ్చితంగా కన్నులపండుగే. ఆనాటి జయప్రద, జయసుధ అభిమానులకు వారి ఎపిసోడ్ కూడా నయనానందం కలిగిస్తుందని చెప్పవచ్చు.

Exit mobile version