మొత్తానికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైపోయింది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా సినిమాల ప్రారంభోత్సవాలను గత రెండు మూడు రోజులుగా వరుస పెట్టి జరుపుతున్నారు. ఆ క్రమంలోనే నిరాడంబరంగా సంస్థ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మూవీ పూజాను జరిపేశారు. జూలై రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తారని సమాచారం. సముతిర కని నటించి, దర్శకత్వం వహించిన ‘వినోదాయ సీతం’ కు ఇది రీమేక్. జీ 5 సంస్థ నిర్మించిన ఈ తమిళ ఈ సినిమాను ఇప్పుడు ఆ సంస్థతో పాటు తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ కు చెందిన ఫార్ట్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా రీమేక్ చేస్తున్నాయి. సముతిర కని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తుండగా, తమిళంలో తంబి రామయ్య పోషించిన పాత్రను తెలుగులో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
బేసికల్ గా దర్శకుడైన సముతిర కని, ఆ తర్వాత నటుడిగా మారాడు. తెలుగులోనూ పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. పృథ్వీతో 2004లో ‘నాలో’ చిత్రాన్ని రూపొందించిన సముతిర కని తమిళంలో తాను తీసిన ‘నాడోడిగళ్’ను 2010లో ‘శంభో శివ శంభో’పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఆ తర్వాత ఐదేళ్ళకు నాని హీరోగా ‘జండాపై కపిరాజు’ను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడీ సినిమా తెలుగులో దర్శకుడిగా సముతిర కనికి నాలుగోది! ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అతను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కడం విశేషమనే చెప్పాలి.