Pillalamarri Raviteja: కళామతల్లిని నమ్ముకున్నవారు అంత తేలిగ్గా ఈ రంగాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. ఎప్పుడోకప్పుడు అవకాశం దక్కకపోతుందా, సక్సెస్ ను కొట్టక పోతామా అనే ఆశతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఆర్టిస్టు అవుదామని ఎన్నో కలలు కని హైదరాబాద్ కు వచ్చి, మోడల్ గా మారి, ఆ పైన ప్రొడక్షన్ మేనేజర్ గా పలు చిత్రాలు చేశాడు పిల్లలమర్రి రవితేజ. ఇప్పుడు అతని చిరకాల వాంఛ నెరవేరే రోజు వచ్చింది. అతను హీరోగా ఏకంగా రెండు సినిమాలు మొదలు కాబోతున్నాయి.
అందంతో పాటు అభినయం, డాన్సులో, ఫైట్స్ లో శిక్షణ పొందిన పిల్లలమర్రి రవితేజ ఆస్త సినీ క్రియేషన్స్ బ్యానర్ పైన మొదటి సినిమాను, భాస్కర్ ఎంటర్టైన్మెంట్ మీద రెండో సినిమాను చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన కథ చర్చలు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. దసరా తర్వాత ఒకేసారి రెండు సినిమాల ఓపెనింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 29 రోజున పిల్లలమర్రి రవితేజ పుట్టిన సందర్బంలో ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ తమ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా సక్సెస్ కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.