ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డు ఆమోదం పొందలేదని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also : ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో స్టార్ హీరో పోటీ ?
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం గాంధీ, గాడ్సేపై చిత్రానికి వ్యతిరేకంగా న్యాయవాది అనూజ్ భండారీ సికిందర్ బహల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ప్రకారం చిత్రంలో మహాత్మా గాంధీని కించపరిచే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రంలో నాథూరామ్ గాడ్సేని కీర్తించారు. ఈ సినిమా ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ సినిమాను నిషేధించాలి అంటూ ఈ సినిమా విడుదలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటిషన్‌లో అనూజ్ భండారీ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీని కారణంగా ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపిన రోజు ఇదే. ఆ అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా 2017లోనే పూర్తయింది. థియేటర్లలో విడుదల చేసే అవకాశం రాలేదు. ఈ చిత్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు ఎంపి అమోల్ కొల్హే నాథూరామ్ గాడ్సే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలపై వివాదం నెలకొంది, ఈ విషయంపై సుప్రీం కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ఓటిటిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.