శేషశైలవాసుని మురిపించిన స్వరకర్త … పార్వతీవల్లభుని పరవశింప చేసిన బాణీలు… చంద్రకళాధరి ఈశ్వరినే ప్రసన్నం చేసుకున్న సంగీతనిధి పెండ్యాల నాగేశ్వరరావు. చిగురాకులలో చిలకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులనే పులకింపచేసిన స్వరకేళి ఆయన సొంతం} ఆయన పంచిన మధురం మరపురానిది- మరువలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామరభేదం లేకుండా అందరినీ అలరించింది. ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చిన పలు చిత్రాలలో భక్తిభావంతో తొణికిసలాడిన గీతాలు రూపొందాయి. ఆ భక్తి గీతాలకు పెండ్యాల పేర్చిన బాణీలు నాటి నుంచి నేటి దాకా భక్తకోటికి పరమానందం పంచుతూనే ఉన్నాయి. అదీ పెండ్యాల స్వరకల్పనలోని మహత్తు.
పెండ్యాల నాగేశ్వరరావు కృష్ణాజిల్లా ఒణుకూరులో 1917 ఏప్రిల్ 6న జన్మించారు. తండ్రి నుండి ఆయనకు హార్మోనియం విద్య అబ్బింది. అదే ఆయనలో కళాతృష్ణ పెంచింది. చదువుకొనే రోజుల్లోనే హార్మోనియం వాయిస్తూ, పద్యాలు పాడుతూ, పాటలు అల్లుతూ నాటకాలు వేస్తూసాగారు. చిత్రసీమలో రాణించాలని అడుగులు వేసిన పెండ్యాల నాగేశ్వరరావుకు తొలుత గాలిపెంచల నరసింహారావు ప్రోత్సాహం లభించింది. ఆయన వద్ద హార్మోనిస్ట్ గా కొంతకాలం పనిచేశారు. తరువాత కె.ఎస్. ప్రకాశరావు నిర్మించిన ‘ద్రోహి’ (1948) చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. వరుసగా కె.ఎస్.ప్రకాశరావు నిర్మించిన చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన బాణీలను సమకాలికులు సైతం అభిమానించేవారు.
పెండ్యాల సంగీతాన్ని సాలూరు రాజేశ్వరరావు కూడా ఎంతగానో అభిమానించారు. పెండ్యాల స్వరకల్పనలో పాడాలని గాయనీగాయకులు సైతం ఎంతగానో ఆరాటపడేవారు… ఆయన స్వరవిన్యాసాలతో సాగినప్పుడే తమ గానకళకు ఓ గుర్తింపు లభిస్తుందనీ భావించేవారు. పెండ్యాల సైతం వారి అభిలాషను పసికట్టి వారి గాత్రానికి పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షలో గాయనీగాయకులను ఉత్తీర్ణులను చేసి, వారిని జనం ముందు విజేతలుగా నిలిపిన సందర్భాలు కోకొల్లలు.
పెండ్యాల సంగీతంతో దోస్తీ చేసిన వారికి పలు సెంటిమెంట్స్ ఉండేవి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’కు పెండ్యాల సంగీతం సమకూర్చారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో సినిమా రంగంలో తొలి ప్రయత్నాలు చేసేవారు పెండ్యాలనే సంగీత దర్శకునిగా ఎంచుకొనేవారు. డి. రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ కు కూడా పెండ్యాలనే సంగీతం సమకూర్చారు. ఇక పెండ్యాల స్వరకల్పనలో రూపొందిన ‘కన్నతల్లి’ (1953) చిత్రం ద్వారా పి.సుశీలకు తొలి అవకాశం కల్పించింది కూడా పెండ్యాలనే. ప్రముఖ కవి, గీత రచయిత దాశరథి పాట చిత్రసీమలో తొలిసారి వెలుగు చూసింది కూడా పెండ్యాల స్వరకల్పనలోనే. ఆచార్య ఆత్రేయ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’ చిత్రంలో దాశరథి సినిమా పాట మొదటిసారిగా జనం ముందు నిలచింది. ఆ చిత్రానికీ పెండ్యాల సంగీతం సమకూర్చారు. అలా పెండ్యాల బాణీల్లోనే దాశరథి పాట ముందు జనానికి పరిచయమయింది. ఆ తరువాత కూడా పలువురు సినీజనం పెండ్యాల తొలి సెంటిమెంట్ ను అనుసరించారు. జయప్రద తొలిసారి తెరపై కనిపించిన ‘భూమికోసం’ చిత్రానికి కూడా పెండ్యాలనే సంగీత దర్శకుడు.
పలు విజయవంతమైన చిత్రాలకు స్వర రచన చేశారు పెండ్యాల. అయితే ఏ నాడూ విజయం వచ్చిందని పొంగిపోలేదు- పరాజయం ఎదురైతే కుంగిపోలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు… మధురాన్ని మన సొంతం చేశారు. పెండ్యాల సంగీతంలో ఎన్నో మధురగీతాలు మన సొంతమయ్యాయి. అయితే ఆ పాటల్లో ఎక్కడో విన్న బాణీలు కూడా వినిపిస్తాయనే విమర్శ ఉంది. దర్శకనిర్మాతలు మోజుపడి ఉత్తరాది బాణీలను అదేపనిగా తమ చిత్రాల్లో పొందు పరచమని కోరినప్పుడు కాదనలేక పోయేవారు పెండ్యాల. అలాంటి సమయాల్లో ఎక్కడో విన్న రాగమే అనిపిస్తుంది. కానీ, అందులోనే పెండ్యాల ప్రతిభా మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. చివరి దాకా మధురామృతం మనకు అందించడానికే ప్రయత్నించారు పెండ్యాల. తన సంగీత ప్రయాణంలో సందర్భోచితమైన స్వరకల్పన చేయడానికే తపించారు పెండ్యాల. ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాల ఫలితాల్లో తేడాలు ఉండవచ్చు. కానీ, పెండ్యాల సంగీతం సదా మధురాన్నే మన సొంతం చేసింది.