నందమూరి తారక రామారావును ఏ ముహూర్తాన ‘నటరత్న’ అన్నారో, ఎవరు ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని దీవించారో కానీ, ఆయన ఆ బిరుదులకు అన్ని విధాలా అర్హులు! అంతేనా ఆయన నటజీవితంలో అన్నీ ఎవరో అమర్చినట్టుగానూ జరిగిపోయాయి. తెలుగునాట హీరోగా వంద చిత్రాలను, రెండు వందల సినిమాలను అతివేగంగా పూర్తి చేసిన ఘన చరిత్ర ఆయన సొంతమే! ఇక ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక, జానపద చిత్రాలో కథానాయకునిగా వెలుగొందిన ఘనత కూడా ఆయన పాలే! మన దేశంలో అత్యధిక శతదినోత్సవాలు చూసిన రికార్డు, తెలుగునాట తొలి స్వర్ణోత్సవం, వజ్రోత్సవం చూసిన ఘనత, దక్షిణాదిలో తొలిసారి కోటి రూపాయల చిత్రం చూపిన వైనం అన్నీ ఆయనకే రాసిపెట్టాయనిపిస్తుంది. వాటితో పాటు ‘లీపు సంవత్సరం’లోని ఫిబ్రవరి 29వ తేదీన విడుదలై, తెలుగులో ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రం కూడా యన్టీఆర్ రికార్డుల్లోనే నిక్షిప్తమై ఉంది. ఆ సినిమాయే యన్టీఆర్ హీరోగా విజయా సంస్థ నిర్మించిన ‘పెళ్ళి చేసి చూడు’! ఈ సినిమా 1952 ఫిబ్రవరి 29న విడుదలై, ఆ యేడాదికే బ్లాక్ బస్టర్ గా నిలచింది. నిజానికి ఈ చిత్రం 70 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నా, లీపు సంవత్సరం లెక్కల ప్రకారం 17 ఏళ్ళే చూసిందన్న మాట!
కొన్ని విశేషాలు…
‘పెళ్ళి చేసి చూడు’ టైటిల్ లోనే చమత్కారం ఉంది. అది చక్రపాణి వారి మార్కు చమక్కు! ఈ చిత్రం కథలోనూ, కథనంలోనూ ఆ రోజుల్లో కొత్త పోకడలు చూపారు. ఈ సినిమా నాటకంతో ప్రారంభమవుతుంది. ఇందులో హీరో, ఇంటర్వెల్ కు ముందు దర్శనమిస్తాడు. ఇక నవ్విస్తూనే, సమాజంలో దురాచారంగా మారిన ‘వరకట్నం’పై విసుర్లు వేస్తారు. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు చూసినా ‘పెళ్ళి చేసి చూడు’లోని కథ యువతను ఆలోచింప చేసేలానే ఉంటుంది. ఇక ఈ సినిమాతో ఎంతోమందికి మంచి పేరు లభించింది. విజయా వారి ‘షావుకారు’తోనే హీరో అంటే ఇలాగే ఉండాలన్న పేరు సంపాదించారు రామారావు. అదే సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’తో ఆయన సూపర్ స్టార్ గా మారిపోయారు. ఆ తరువాతే ‘పెళ్ళి చేసి చూడు’ జనం ముందు నిలచింది. అప్పటికే ‘తోటరాముడు’గా జనం మదిలో నిలచిన యన్టీఆర్ ను చూడాలని ఈ సినిమాకు జనం పరుగులు తీశారు. కానీ, చిత్రంగా సినిమాలో యన్టీఆర్ పాత్ర ద్వితీయార్ధానికి కాస్త ముందు దర్శనమిస్తుంది. అప్పట్లో అదీ ప్రయోగమే అని భావించారు ప్రేక్షకులు. ఇక ‘పాతాళభైరవి’లో నేపాల మాంత్రికునిగా అలరించిన యస్వీరంగారావు ఇందులో దూపాటి వియ్యన్న పాత్రలో నటించి, కేరెక్టర్ యాక్టర్ గా తన కెరీర్ ను మలుపు తిప్పుకున్నారు. ఈ సినిమాలో ఉపనాయికగా కనిపించిన సావిత్రికి ఆ తరువాతే హీరోయిన్ గా అవకాశాలు పలకరించాయి.
ఇంతకూ కథ ఏమిటంటే…
ఇన్ని విశేషాలకు నెలవైన ‘పెళ్ళి చేసి చూడు’ చిత్రం కథేమిటంటే – కొడుకు రాజా, కూతురు అమ్మడు, సిసింద్రీతో కలసి రాజమ్మ జీవిస్తూ ఉంటుంది. రాజా, సిసింద్రీ నాటకాలు వేస్తూంటారు. రాజమ్మ అన్న గోవిందయ్య తన కూతురును రాజాకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. రాజా మాత్రం చెల్లెలు అమ్మడుకు పెళ్ళి చేయనిదే, తాను వివాహమాడనని భీష్మించుకుంటాడు. రాజా, సిసింద్రీ ఓ సారి పక్కన ఉన్న జమీందార్ వియ్యన్న దగ్గరకు వెళ్ళి తమ చెల్లి పెళ్ళి విషయం మాట్లాడతారు. ఆ సమయంలో రాజాకు పెళ్ళి కాలేదని తెలిసి వియ్యన్న తన కూతురు సావిత్రిని ఇచ్చి వివాహం జరిపిస్తారు. తరువాత షావుకారు వెంకటపతి కొడుకు వెంకటరమణతో అమ్మడు పెళ్ళి అయ్యేలా చూస్తాడు వియ్యన్న. పెళ్ళి జరుగుతూ ఉండగా, గోవిందయ్య వెళ్ళి వెంకటపతితో అమ్మడు వాళ్ళ దగ్గర సొమ్మేలేదని, మిమ్నల్ని మోసం చేశారని చెబుతాడు. దాంతో వియ్యన్న నోటు రాసిస్తానని అంటాడు. అప్పటికే వెంకటరమణ, అమ్మడు మెడలో మూడు ముళ్ళు వేసి ఉంటాడు. బలవంతంగా తన కొడుకును తీసుకు పోతాడు వెంకటపతి. రాజా వెళ్ళి వెంకటరమణ కాళ్ళా వేళ్ళా పడతాడు. రమణనే ఓ మార్గం చూపిస్తాడు. తాను మద్రాసులో ఉంటానని చెప్పి, భార్య ఊరికి వెళ్ళి కాపురం మొదలెడతాడు. తరువాత వారికి ఓ కొడుకు పుడతాడు.
వెంకటరమణ రాకపోవడంతో తండ్రి మద్రాసు వెళతాడు. అక్కడ పిచ్చి పట్టిందనే నాటకం ఆడతారు. పిచ్చి కుదర్చడానికి ఓ నర్సును డాక్టర్ పంపించినట్టు అమ్మడును ఊరికి తీసుకువెళతారు. అక్కడ పిల్లాడు ఏడ్వడంతో నాటకం బయట పడుతుంది. ఇదంతా ఓ వైపు సాగుతూ ఉండగానే గోవిందయ్య తన కూతురు చిట్టిని రమణకు ఇచ్చి పెళ్ళి చేయాలని తంటాలు పడతాడు. చివరకు రమణ కాకపోతే, వెంకటపతినే తన కూతుర్ని పెళ్ళి చేసుకోమంటాడు. వియ్యన్న వచ్చి, గోవిందయ్యను చీవాట్లు పెడతాడు. గోవిందయ్య కూతురు చిట్టిని, ఆమె కోరుకున్న బావ భీముని వెంటే పంపిస్తారు. మనవడిని చూసిన వెంకటపతి మురిసిపోతాడు. అన్నీ మరచిపోతాడు. మనవడిని తనకు ఇమ్మంటాడు వెంకటపతి. ససేమిరా అంటాడు రమణ. తన భార్య బిడ్డను తీసుకొని రమణ బయలుదేరుతూ ఉండగా, వెంకటపతి చనిపోయినట్టు నటిస్తాడు. దాంతో అందరూ తిరిగివస్తారు. ఇలా జరుగుతుందని తెలిస్తే, బాబును ఇచ్చేవాడినే అంటాడు రమణ. దాంతో లేచి కూచుంటాడు వెంకటపతి. మనవడిని తీసుకొని సంబరంగా వెళతాడు. అందరూ ఆనందంగా నవ్వుతూ ఉండగా కథ ముగుస్తుంది.
ఇందులో యన్.టి.రామారావు, యస్వీ రంగారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, జోగారావు, డాక్టర్ శివరామకృష్ణయ్య, దొరస్వామి, మీనాక్షి, సూర్యకాంతం, పుష్పలత, మహంకాళి వెంకయ్య, వల్లూరి బాలకృష్ణ, చదలవాడ, పద్మనాభం, గాదె బాలకృష్ణ (మాస్టర్ కుందు) కీలక పాత్రలు పోషించారు.
‘పెళ్ళి చేసి చూడు’ చిత్రానికి చక్రపాణి రచన చేయగా, పింగళి నాగేంద్రరావు, ఊటుకూరి సత్యనారాయణ పాటలు రాశారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. మార్కస్ బారట్లే కెమెరా పనితనం చూపారు.
ఇందులోని “బ్రహ్మయ్యా… ఓ బ్రహ్మయ్యా…”, “అమ్మా నొప్పులే…” పాటలను ఊటుకూరి సత్యనారాయణ రాశారు. మిగిలిన 14 పాటలను పింగళి నాగేంద్రరావు కలం పలికించింది, వాటిలో “ఏడుకొండలవాడా… వెంకటరమణా…”, “ఎవరో… ఎవరో…”, “పెళ్ళి చేసి చూపిస్తాం…”, “ఏ వూరి దానవే…”, “మనసా నేనెవరో నీకు తెలుసా…”, “ఈ జగమంతా నాటికరంగం…” వంటి పాటలు అలరించాయి అన్నిటినీ మించి “ఓ భావిభారత భాగ్యవిధాతలారా…” అనే సాకీతో మొదలయ్యే “పెళ్ళి చేసికొని… ఇల్లు చూసుకొని…” పాట ఈ నాటికీ విశేషాదరణ పొందుతూనే ఉంది.
మరికొన్ని విశేషాలు…