Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభాస్ వచ్చి యాప్ నే క్రాష్ చేసి వెళ్ళాడు. బాలయ్య- ప్రభాస్ ల ఎపిసోడ్ రికార్డులు సృష్టించింది. ఇక ఆ రికార్డులను తిరగరాయడానికి పవన్ వచ్చేస్తున్నాడు. మొట్ట మొదటిసారి పవన్.. ఒక టాక్ షోకు వెళ్లడం.. అందులోనూ ఆ షోను బాలయ్య హోస్ట్ చేయడంతో అందరి చూపు ఈ ఎపిసోడ్ మీదనే ఉంది. ఇక ఈ షోకు వెళ్ళినవారు అక్కడ బాలయ్య అడిగిన ప్రశ్నలకు పవన్ ఎలా స్పందించాడు అనేది చెప్పి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ షో లో బాలయ్య.. పవన్ ను బాగానే సందిగ్ధంలో పడేశాడట. కొంచెం చిక్కు ప్రశ్నలను వేసి గట్టి సమాధానాలనే రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ మూడు పెళ్లిళ్ల గురించి, ఆయన ఆహార్యం గురించి, టీడీపీ పొత్తు గురించి బాలయ్య ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా బాలయ్య, పవన్ అన్న చిరంజీవి గురించి కూడా అడిగినట్లు తెలుస్తోంది. అన్నయ్య చిరంజీవి దగ్గర నుంచి మీరేమి నేర్చుకున్నారు అని బాలయ్య అడుగగా.. అన్నయ్య నుంచి కష్టపడే స్వభావం నేర్చుకున్నానని, దానివలన ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకొచ్చాడట పవన్. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో టాలీవుడ్ కు కింగ్ గా మారిన ఆయన జీవితం ఒక ముళ్ల బాట.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. చిరు అనే మహా వృక్షం నుంచి ఎదిగిన కొమ్మలు మెగా హీరోలు. ఆయనంటూ లేకపోతే మెగా ఫ్యామిలీ అనేదే లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ కష్టపడే స్వభావమే అన్న నుంచి పవన్ అందిబుచ్చుకున్నాడు. కోట్ల ఆస్తి, సినిమాలు, స్టేటస్ అన్ని వదిలి ప్రజలకు మంచి జరిగితే చాలు అంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతున్నా నిలబడి ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడు. మరి పవన్ ఈసారైనా ఎన్నికల్లో గెలుస్తాడేమో చూడాలి.