పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు మనసు అయితే ఇంకొకరు తనువు. వారిద్దరిని విడదీసి చూడడం అనేది జరగని పని. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకపోయినా త్రివిక్రమ్ మాట వింటాడు అన్నది జగమెరిగిన సత్యం. ఇక తమ స్నేహ బంధం గురించి వీరిద్దరూచాలా సందర్భాల్లో బాహాటంగానే చెప్పుకొచ్చారు.
ఇక గురువారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” నాకు, త్రివిక్రమ్ కి అన్ని విషయాలు ఒకేలా ఉంటాయి కానీ, ఒక్క పుస్తకాల విషయంలోనే మా ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. ఇద్దరం పుస్తకాల పురుగులమే.. నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి అతడికి నచ్చి ఇవ్వమని అడిగితే నేను అస్సలు ఇవ్వను.. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా అయినా చేస్తాను కానీ ఆ పుస్తకం మాత్రం ఇవ్వను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.