ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ లో నటించటానికి ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘తేరి’ రీమేక్‌కు పవన్ ఆమోదముద్ర వేసినట్లు వినికిడి. విజయ్, సమంత నటించిన ఈ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆల్ రెడీ తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలయింది. అయినా కథపై నమ్మకంతో పవన్ రీమేక్ కి ఓకె చెప్పాడట. దీనికి ‘సాహో’ సుజీత్ దర్శకత్వం వహిస్తాడట. ‘సాహో’ తర్వాత చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ చేయవలసిన సుజిత్ కి అది అందినట్లే అంది మిస్ అయింది. జయం రాజా దానిని ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు ‘తేరీ’ రీమేక్ ని పవన్ తో చేసే ఛాన్స్ సుజిత్ కి దక్కిందట. దీనిని ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నటు తెలుస్తోంది. అటు పవర్‌స్టార్ కూడా మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ చేస్తాడని వినిపించినా అది వర్కవుట్ కాలేదు. ఇప్పడు ‘తేరి’ రీమేక్ కి పవన్ సై అంటే ఆయన అభిమానులు పవర్ స్టార్ ను మరోసారి పవర్ ఫుల్ ఖాకీ పాత్రలో చూసే ఛాన్స్ దక్కినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో!?