‘కేకే’ సుపరిచితుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన అకాల మరనం తనను బాధించిందన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన కేకే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తన సినిమాల్లో ఆయన ఆలపించిన గీతాలు.. అభిమానులతో పాటు సంగీత ప్రియుల్ని మెప్పించాయన్నారు. ఖుషీ సినిమాలోని ‘ఏ మేరా జహా’ పాట అన్ని వయసుల వారికి చేరువైందని.. అందుకు కేకే గాత్రమే ప్రధాన కారణమని తెలిపారు.
జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’, బాలులో ‘ఇంతే ఇంతింతే’, జాన’లో ‘నాలో నువ్వొక సగమై’, గుడుంబా శంకర్లో ‘లే లే లే లే’.. మొదలైన గీతాల్ని కేకే పాడారని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆ పాటలన్నీ శ్రోతల్ని ఆకట్టుకోవడమే కాకుండా సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయన్నారు. ‘‘సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే కేకే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. కేకే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.