SS Rajamouli: మన దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళికి ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ గ్యారంటీ అని ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల రాజమౌళి ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ వారి అవార్డ్ ను గెలుచుకున్నారు. 42 మంది సినిమా విశ్లేషకులు ఉన్న జ్యూరీ రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడుగా ఎంపిక చేసింది. ఈ సంస్థ 1935లో ప్రారంభం అయింది. న్యూయార్క్ లోని న్యూస్, మ్యాగజైన్స్, వెబ్ ఐట్స్ వంటి వాటిలో పని చేసే సినిమా విశ్లేషకులు ఈ సంస్థలో మెంబర్స్. అమెరికన్ సినిమాలనే కాకుండా ఇతర దేశాలలో తీసిన సినిమాలను కూడా చూసి ఉత్తమసినిమా, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సినిమాటోగ్రఫీ, యానిమేషన్ వంటి విభాగాల్లో ఈ సంస్థ అవార్డులు ఇస్తూ వస్తోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో ఈ అవార్డులను ప్రకటించి ఆ పై ఏడాది జనవరిలో ప్రదానం చేస్తూ ఉంటారు. నిజానికి ఈ అవార్డులను బట్టి ఆస్కార్ గెలుపొందే వారిని కూడా ఓ అంచనా వేయవచ్చు.
1935 నుంచి ఈ సంస్థ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసిన సినిమాల్లో 43శాతం సినిమాలు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా టాడ్ ఫీల్డ్ డైరెక్ట్ చేసిన ‘టార్’ సినిమాను, ఉత్తమ దర్శకుడుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు యస్.యస్. రాజమౌళిని, ఉత్తమ నటుడుగా ‘ద బంచీస్ ఆఫ్ ఇన్ షేరిన్’లో నటించిన కాలిన్ ఫారెల్ ను, ఉత్తమ నటిగా ‘టార్’లో నటించిన కేట్ బ్లాంచెట్ ను ఎంపిక చేసింది న్యూయార్క్ ఫిలిమ్ క్రిటిక్ సర్కిల్. మరి మార్చి 12, 2023లో జరగబోయే ఆస్కార్ అవార్డుల ప్రదానంలో ఈ న్యూయార్క్ ఫిలిమ్ క్రిటిక్ సర్కిల్ ప్రకటించిన వారిలో ఎంతమంది అస్కార్ లను అందుకుంటారు? వారిలో మన రాజమౌళి ఉంటారా!? అన్నది తేలాల్సి ఉంది. ‘హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్’ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అస్కార్ గెలిచే అవకాశం ఉందని కాలమిస్ట్ స్కాట్ ఫీన్ బర్గ్ అంచనా గా ప్రచురించింది. మరి అసలు మన ‘ఆర్ఆర్ఆర్’ ఏ యే కేటగిరీలలో నామినేషన్స్ దక్కించుకుంటుంది? ఎందులో గెలుపొందుతుందన్నది వేచి చూడాల్సిందే.