Ori Devudaa Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడువులే సినిమాకు అధికారిక రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన అశ్వత్ మర్రిముత్తే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సరసన బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ నటిస్తుండగా ఒక కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్తరం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతోంది. “కేసు నంబర్ 23314 అర్జున్ దుర్గ రాజు.. అను పాల్ రాజు”అంటూ కోర్టులో పిలవడంతో ట్రైలర్ మొదలయ్యింది. ఇక బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్స్ అని పూరి చెప్పిన డైలాగ్ తో హీరో కథ మొదలుపెట్టాడు. అర్జున్, అను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. అనుపై అర్జున్ కు ప్రేమ ఉండదు. కానీ ఒక సందర్భంలో అనును అర్జున్ పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఇద్దరు ఒక్కటి అవుదాం అనుకున్న సమయంలో వీరి జీవితంలోకి మీరా ప్రవేశిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఇక ఊహించని ట్విస్ట్ గా అర్జున్ చనిపోయి దేవుడు వెంకటేష్ కోర్టులో హాజరవుతాడు.
తన కథను దేవుడికి చెప్తే అర్జున్ కు తన జీవితాన్ని సెట్ చేసుకోవడానికి రెండో ఛాన్స్ ఇస్తూ ఒక టికెట్ ను ఇస్తాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే అర్జున్ చనిపోతాడని కండిషన్ పెడతాడు. మరి మరోసారి భూమి మీదకు వచ్చిన అర్జున్, అను ప్రేమను పొందగలిగాడా..? తాను మొదటిచేసినతప్పులను సరిద్దిదుకున్నాడా..? అనేది కథగా తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషికి తన జీవితాన్ని మార్చుకోవడానికి రెండో అవకాశం వస్తే ఎలా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనేదే ఓరి దేవుడా కథ. ఇక అర్జున్ పాత్రలో విశ్వక్ ఒదిగిపోయాడు. మిథిలా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ఇక వెంకీ మామ, రాహుల్ రామకృష్ణ సినిమాకు హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం ఫ్రెష్ గా అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టేశారు మేకర్స్. ఇక చివర్లో వైఫ్ లో ఫ్రెండ్ ను చూడొచ్చు సర్.. కానీ ఫ్రెండే వైఫ్ లా వచ్చిందా అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ కు వెంకీ మామ విజిల్ వేయడం అల్టిమేట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.