Oohalo Telala: అభయ్ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ నటించి, నిర్మించిన ‘ఊహలో తేలాల’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, సినీ రచయిత లక్ష్మీ భూపాల, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం స్వామినాయుడు, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, నాగభైరు సుబ్బారావు, ఎం.ఎన్.ఆర్., ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ధనుంజయ్ లోకి కృషి, పట్టుదలను మెచ్చుకున్నారు. విశాఖపట్నం సమీపంలోని ఓ పల్లెలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధనుంజయ్… మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఎన్నో కుటుంబాలకు ఆధారం కావడం అభినందించదగ్గదని అన్నారు. గతంలోనూ వెండితెరపై మెరిసిన ధనుంజయ్ ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో చక్కని నటన కనబరిచాడని, రాబోయే రోజుల్లో అతను మరింత ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడుతూ, “పిలవగానే మా ఈ వేడుకకు వచ్చిన సంగీత దర్శకులు కోటిగారికి, ఆర్పీ పట్నాయక్‌గారికి ధన్యవాదాలు. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సహించే స్వామినాయుడు గారికి, లక్ష్మీభూపాలగారికి.. మీడియా మిత్రులు ప్రభు, సుబ్బారావుగారికి, ఈ వేడుకకు వచ్చిన ఇతర మిత్రులకు నా ధన్యవాదాలు. ‘ఊహలో తేలాల’ ఆల్బమ్‌లోని పాటను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడం జరిగింది. మా డైరెక్టర్ ఫణి గణేష్ అద్భుతంగా ఈ పాటని చిత్రీకరించారు. ప్రముఖ నేపథ్య గాయకులు కారుణ్య, చిన్మయి, యాసిన్ నజీర్ ఈ పాటను మూడు భాషల్లో ఆలపించారు. అలాగే ఇందులో నటించిన వారు కూడా ఎంతో చక్కగా చేశారు. వారందరినీ మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ఈ ఆల్బమ్ కు వంశీకాంత్ సంగీతం సమకూర్చగా, ఎస్.ఎస్. వీరు రచన చేశారు. యోగిరెడ్డి సినిమాటోగ్రఫీని, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీని అందించారు.