టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం పరాజయాలను చవి చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మహా సముద్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శర్వా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ని బట్టి చూస్తుంటే శర్వా మరో కొత్త ప్రయోగానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఎప్పుడు అందరు ఇంట్రెస్టింగ్ గా చూసే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ని శర్వా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
టీజర్ విషయానికొస్తే” ముగ్గురు స్నేహితులు.. ఒక తల్లి.. ఎంతో ఆనందంగా జరుగుతున్న జీవితం.. ఇంతలో ఒక సైంటిస్ట్ ప్రయోగం.. అదే టైమ్ ట్రావెల్.. అందులో చిక్కుకున్న ముగ్గురు యువకులు. తాను తయారుచేసిన మెషిన్ పనిచేస్తుందో లేదో అని తెలుసుకోవడానికి ముగ్గురు యువకులను అందులోకి పంపుతాడు సైంటిస్.. ఈ నేపథ్యంలో టైమ్ మిషన్ సహాయంతో హీరో తన ఇద్దరు మిత్రులతో కలిసి తన బాల్యంలోకి వెళ్లడం.. ఆ మిషన్ రూల్స్ ఎలా పాటించాలో చెప్పడం లాంటివి టీజర్ లో చూపించారు. టీజర్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.
ఇక చివర్లో చిన్నప్పుడు అందరు ఎంతగానో మైమరిచిపోయే వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ ని చూసి ముగ్గురు ఎమోషనల్ అవ్వడం నవ్వులు పూయిస్తోంది. ఇక ముగ్గురు యువకులుగా శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కనిపించగా సైంటిస్ట్ గా నాజర్ కనిపించాడు. ఇక శర్వా తల్లిగా అమల అక్కినేని కనిపించింది. మొత్తానికి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. జేక్స్ బీజోయ్ సంగీతం ఆకట్టుకోంటుంది . ఈ సినిమాకి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరి వరుస పరాజయాలను చవిచూస్తున్న శర్వా ఈ కొత్త కాన్సెప్ట్ తో మళ్లీ హిట్ ట్రాక్ ని అందుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.