బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీ.. ఈ నెలలో బయటికి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక కేసును ప్రెస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. కోట్లల్లో నగలు, డబ్బులు ఎత్తుకెళ్లింది వేరే ఎవరో కాదని.. ఆ ఇంట్లో పనిచేసే నర్సే అని పోలీసులు తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా ఢిల్లీలోని తమ విలాసవంతమైన ఇంట్లో తల్లిదండ్రులతో సహా నివాసముంటున్నారు. సోనమ్ గర్భిణీ కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లడంతో ఆనంద్ తన తల్లి ఆరోగ్యం చూసుకోవడానికి కేర్ టేకర్‌గా అపర్ణ రూతు విల్సన్ అనే నర్సును నియమించారు. ఆమె కొన్ని రోజులు బాగానే పనిచేసినా.. ఇంట్లో ఎవరు లేకపోవడంతో అడ్డదారి తొక్కింది.
తన భర్త నరేశ్ కుమార్ తో కలిసి ఆమె ఇంట్లో ఉన్న నగలను, డబ్బును కాజేయాలని ప్లాన్ వేసింది. ఫిబ్రవరి 11 అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో భర్తను పిలిచి ఇంట్లో ఉన్న రూ.2.4 కోట్ల నగదును, ఆభరణాలను కాజేశారు. అనంతరం ఏమి ఎరగనట్లు రెండు నెలలుగా ఆమె పనిలోకి వస్తూ .. ఎవరు దొంగతనం చేసారో అన్నట్లుగా నటించింది. ఇక ఇంట్లో చోరీ జరిగిందని సోనమ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పనివారిని విచారిస్తూ వారి ఇళ్లను సోదాలు చేయడం మొదలుపెట్టారు . తాజాగా అపర్ణ ఇంటిని కూడా సోదా చేసిన పోలీసులకు సోనమ్ ఇంట్లో మాయమైన నగలు కనిపించాయి. దీంతో అపర్ణను, ఆమె భర్తను అరెస్ట్ చేసి విచారించగా.. తామే ఆ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.